సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తన వెంట టీడీపీలో ఎవ్వరూ చేరలేదన్న అపప్రదతో ఇప్పుడు కొద్ది మంది నేతలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కొద్ది మంది ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని అభ్యర్థిస్తున్నట్టు సమాచారం. సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఇలా ఆ పదవిలోకి వచ్చేందుకు ఎంత ఖర్చు చేశారని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం తాము ఇస్తామని, టీడీపీలో చేరాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తద్వారా తనతో పాటు పలువురిని అధికార పార్టీలో చేర్పించినట్టు ప్రకటించుకోవడంతో పాటు తన వెంట కొద్ది మంది ప్రజా ప్రతినిధులు కూడా వచ్చారని చెప్పుకునేందుకు ఉపయోగపడుతుందనేది ఎంపీ వర్గీయుల ఆలోచనగా ఉంది. అయితే, ఇదేమీ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఎవ్వరూ రాలేదా!
వాస్తవానికి ఎంపీ బుట్టా రేణుక గెలిచిన మూడు రోజులకే ఆమె భర్త నీలకంఠం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడి, ప్రశ్నల పరంపరతో బుట్టా రేణుక అప్పట్లో పార్టీ మారలేదు. తాను వైఎస్సార్‌సీపీని వీడనని కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. చివరకు అధికార పార్టీ నుంచి వచ్చిన ఆఫర్లతో ఆమె ఇటీవల పార్టీ మారారు. ఆమెతో పాటు పలువురు టీడీపీలో చేరుతున్నట్టు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కండువాలు కూడా కప్పించారు. అయితే..వారిలో అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న వారు కొందరు కాగా.. మరొకరు ఏకంగా ఎంపీ కార్యాలయ ఉద్యోగి కావడం గమనార్హం.
దీనిపై విమర్శలు రావడంతో పాటు ఎంపీ మినహా పార్టీ ఎవ్వరూ మారలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. సీఎంకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరువు నిలబెట్టుకునేందుకు కొద్ది మంది ప్రజా ప్రతినిధులను టీడీపీలో చేర్పించేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఎంత ఖర్చు అయ్యిందో అంత మొత్తం తాము ఇస్తామని అంటుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎంపీ పార్టీ మారినందుకు వచ్చిన మొత్తంలో నుంచి కొంత ఈ విధంగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment