ఎంపీ గీత అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
- ఎమ్మెల్యే వంతల, వైఎస్సార్ సీపీ నేత అనంతబాబు డిమాండ్
- ఆమెది ఆది నుంచీ నేరచరిత్రేనని ఆరోపణ
రంపచోడవరం : అరకు ఎంపీ కొత్తపల్లి గీత అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్ (బాబు) డిమాండ్ చేశారు. ఇందుకోసం హైకోర్టులో కూడా వ్యా జ్యం వేస్తామన్నారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గీత నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందారని, తన కుల ధృవీకరణ పత్రాల విషయంలో కూడా నకిలీ పత్రాలనే సమర్పించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆమె కులధృవీకరణ పత్రాన్ని రద్దు పరుస్తూ, ఆమె గిరిజనురాలు కాదని, క్రిస్టియన్ బీసీ ‘బి’ కేటగిరీగా ప్రకటించారన్నారు.
అప్పట్లో ఈ విషయమై హైకోర్టుకు వెళ్లగా పునర్విచారణకు ఆదేశించారన్నారు. అది పరిశీలనలో ఉన్న సమయంలోనే ఆమె అడ్డతీగల తహశీల్దార్ కార్యాలయంలో కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయగా 2.7.2013న తిరస్కరించారన్నారు. తర్వాత అదే తహశీల్దార్, రెవెన్యూ అధికారులు గీతతో కుమ్మక్కై కులధృవీకరణ పత్రం మంజూరు చేశారన్నారు. నిబంధనల ప్రకారం పరిశీలిన కమిటీలో పెండింగ్‌లో ఉన్నప్పుడు కులధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయకూడదన్నారు. ఈ వ్యవహారంలో నిజమైన గిరిజనురాలికి న్యాయం జరగాలంటే గీతకు సహకరించిన రెవెన్యూ అధికారులపైన, పరిశీలన కమిటీలపైన సీబీఐ విచారణ జరపాలన్నారు.
గతంలో గీత అనంతపురం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పడు భారీ మొత్తంలో సొమ్ము ( సుమారు రూ.50లక్షలు) డ్రా చేసి తన సొంత ఖర్చులకు వాడుకున్నారని, దీనిపై అప్పటి అనంతపురం కలెక్టర్ అనంతపురం పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు పెట్టారని, ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. నేర చరిత్ర కలిగిన గీత మొదటి నుంచీ ఇప్పటి వరకు చేసిన అన్ని అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ భారతి, ఎంపీపీ అరగాటి సత్యనారాయణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, నాయకులు పత్తిగుళ్ల రామాం జనేయులు, వరప్రసాద్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.