రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్(పాతచిత్రం)
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న రెండేళ్లలో రాజమండ్రికి స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, తిరుపతి, షిరిడి వంటి ప్రాంతాలకు విమానం నడపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను కోరినట్లు వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరామని తెలిపారు. అదే విధంగా దివాన్ చెరువు నుంచి జొన్నాడ జంక్షన్ వరకు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
‘గోదావరి నదీ జలాలను కాలుష్యం బారి నుంచి కాపాడాలని జలశక్తి మంత్రిని కోరాం. రూ. 780 కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును కూడా తయారు చేసి పంపాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకై వడ్డీలేని రుణాలు ఇవ్వాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను కోరాం. శేషాద్రి, జన్మభూమి రైళ్లకు అనపర్తిలో స్టాప్ కల్పించాలని విఙ్ఞప్తి చేశాం. ఇక శేషాద్రికి ఇప్పటికే అనుమతి లభించింది. అదే విధంగా ఫోర్ లైన్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని కోరాము’ అని ఎంపీ భరత్ పేర్కొన్నారు. పోలవరం సందర్శన పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. పోలవరంలో ముందు చూపు లేకుండా కాపర్ డ్యాం నిర్మించడంతో గిరిజన గ్రామాలు ముంపు బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ప్రాణనష్టం లేకుండా సహాయక చర్యలు చేపట్టగలిగామని తెలిపారు.
ఇక రాజమండ్రి సిటీ బ్యూటిఫికేషన్ కోసం త్వరలో చర్యలు చేపట్టి...నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ‘గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియం మంజూరు అయిందని హడావిడి చేసింది. ఇందుకోసం కేటాయించిన 13 కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పథకానికి తరలించింది. రాజమండ్రిలో ఒలంపిక్ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం. క్రీడలను విద్యతో సమానంగా ఆదరించాలి. 2020 ఒలంపిక్స్‌లో అధిక మెడల్స్ వచ్చేలా కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. అదే విధంగా కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ చమురు లీకేజీల గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రానికి అత్యధికంగా పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment