సాక్షి, విశాఖపట్టణం : ప్రజలకు సేవ చేయడానికే తమ ప్రభుత్వం పని చేస్తుందని, పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ కట్టడాలపై తప్పనిసరిగా చర్యలుంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో ఆయన శనివారం ప్రభుత్వ పథకాలుపై అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మట్లాడుతూ.. అక్రమార్కులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేయాలని సూచించారు.
రైతు భరోసా, అమ్మ ఒడి, ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రధాని ఇచ్చే అపాయింట్‌మెంట్ బట్టి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతామయన్నారు. ఆంధ్రబ్యాంకు విలీనం చేసినప్పటికీ ఆంధ్రబ్యాంకు పేరును కొనసాగించాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారని అన్నారు. విశాఖ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారని, విజయవాడ రైల్వే డివిజన్‌లో కలపకుండా విశాఖ రైల్వే డివిజన్‌ను కొనసాగేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, అమ్మ ఒడి, ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీకి అధికారుల సహకారంతో పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. దీనిపై అభ్యర్ధులు సంతృప్తిగా ఉన్నారన్నారు. విశాఖ సిటీని అన్ని విధాల అభివృద్ది చేయడానికి కృషి చేయాలని, దీనికి తమ నుంచి అన్ని సహాకారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఇసుక కొరతను అధికమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపీదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. జీవీఎంసీ, విఎంఆర్డిఏ అధికారులతో సమీక్ష నిర్వహించామని, రెవిన్యూ , జీవిఎంసీ పరిధిలో పలు అభివృద్ధి అంశాలుపై చర్చించామని అన్నారు. విశాఖను రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, నగర అభివృద్ధిపై ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమీక్షలో రవాణా అంశాలపై చర్యించామని, ఎక్కువ రద్దీ ఉన్న ఎన్ఏడి కూడలి పనులు జనవరి వరకు పూర్తి చేయాలని ఎంపి విజయసాయిరెడ్డి ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇసుక కొరత తీర్చేలా డిపో లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు,సామాన్యులకి ఇసుక కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాలు ప్రజాధనం దుర్వినియోగం చేశాయని, అందుకే వాటి విషయంలో త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎలాంటి పొరపాట్లు లేకుండా 1.26 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడంపై అధికారులను అభినందించారు. గ్రామ వార్డ్ సచివాలయాలు సీఎం జగన్ గారి మానస పుత్రికలన్నారు.
ఈ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకట రమణ, ముత్తం శెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎమ్.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, చెట్టి ఫల్గుణ, పార్టీ నగర అధ్యక్షులు శ్రీనివాస్ వంశీకృష్ణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయ ప్రసాద్, కుంభా రవిబాబు, అరకు ఎంపి మాధవి అనకాపల్లి ఎంపి డాక్టర్ సత్యవతి , విప్ బూడి ముత్యల నాయుడు, పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా, జివిఎంసి కమిషనర్ సృజన,అలాగే మహిళా కన్వీనర్లు గరికిన గౌరీ, పీలా వెంకట లక్ష్మీ, సాగరిక, పార్టీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, రొంగలి జగన్నాధం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment