మండలంలో లక్కవరం గ్రామంలో గురువారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ అవంతి ...
చోడవరం టౌన్: మండలంలో లక్కవరం గ్రామంలో గురువారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ అవంతి శ్రీనివాసరావుని, అలాగే ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజుని ఎస్సీ కాలనీ వాసులు సమస్యలపై నిలదీశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం ఎస్సీకాలనీని సందర్శించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరుపెట్టారు. కాలనీలో ఇప్పటి వరకు డ్రైనేజీలు నిర్మించలేదని, వాటర్ ట్యాంకు శిథిలమైందని, కమ్యూని భవనం లేదని, హుద్‌హుద్ తుపానుకు కూలిపోయిన స్టేజ్‌కు ఇంతవరకూ మరమ్మతులు చేపట్టలేదని నిలదీశారు.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ సమస్యలపై అడిగేందుకు ఇది సమయం కాదని, అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించేటప్పుడు దానిగురించి మాట్లాడాలని ఆవేశంగా అన్నారు. అయితే తమ సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలని అక్కడి యువకులు ప్రశ్నించడంతో చోడవరంలోనే నిత్యం ఉంటామని, గ్రామానికి చెందిన నాయకులను తీసుకొని వస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కారానిక చర్యలు తీసుకుంటానని ఎంపీ అవంతి హామీ ఇచ్చారు. దీంతో యువకులు శాంతించారు.