శరీరంపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
అప్రమత్తమై అడ్డుకున్న పోలీసులు
బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలింపు
ఒంగోలు టౌన్: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోవాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండో రోజైన మంగళవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కలెక్టరేట్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. కలెక్టరేట్‌లోని ఔట్ గేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు.
పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ, కందుకూరు డివిజన్ నాయకుడు సూరిపోగు శ్యామ్‌లు అప్పటికే తమతోపాటు తెచ్చుకున్న కిరోసిన్ బాటిళ్ల మూతతీసి శరీరంపై పోసుకున్నారు. దీంతో కలకలం ప్రారంభమయింది. గమనించిన పోలీసులు ఒక్క ఉదుటున వారిద్దరిని పట్టుకొని వారిచేతిలో ఉన్న కిరోసిన్ బాటిళ్లను లాక్కున్నారు. ఇద్దరినీ పోలీసు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కించారు. ఆ సమయంలో కొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసుల అరెస్టులను నిరసిస్తూ నినాదాలు చేయడంతో వారిని కూడా అదుపులోకి తీసుకొన్నారు.
ఆరెస్టు చేసిన వారిని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు కలెక్టరేట్ ముట్టడిని ఉద్దేశించి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగలకు పెద్ద మాదిగను అవుతానంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వర్గీకరణ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. వర్గీకరణ చేయకపోతే మాదిగల ఆగ్రహాన్ని చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని బ్రహ్మయ్య మాదిగ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Published Wed, Dec 24 2014 2:36 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
Advertisement