
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింపజేసి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి స్థాయిలో చేసినప్పుడే తమ జాతికి నిజమైన దీపావళని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని తన నివాసంలో శనివారం రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం విలేకర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ఇచ్చిన హామీ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు కు సుమారు నాలుగేళ్లు పట్టిందని, ఇప్పటికైనా చెయ్యాలనే ఆలోచన కలిగినందుకు సంతోషమ ని అన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యమించిన తమ సోదరులను పోలీసుల చేత కొట్టించడం, తిట్టించడం వంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమ న్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటు వంటి ఆందోళనా చేయకుండానే ఇచ్చిన హామీలు అమలు చేశారని, అలా పొందలేకపోతున్నందుకు బాధ పడుతున్నామని అన్నారు.
టిఫిన్‌తో సరిపెట్టారు...
ఎన్నికల సమయంలో కాపులకు అన్నం పెడతా నని చెప్పి, టిఫిన్‌తో సరిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాపు జనాభా కోటి పైనే ఉండగా జనాభా శాతం తక్కువ చూపించి 5శాతం రిజర్వేషన్‌తో సరిపెట్టార న్నారు. రిజర్వేషన్ శాతం రెట్టింపు చేసి తమ జాతికి అన్నం పెడితే బాగుండేదన్నారు. రిజర్వేషన్ల అమలుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాటిమాటికీ తన వెంట జగన్ ఉన్నారు, మోదీ ఉన్నారంటూ టీడీపీ నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, 1994లో ఉద్యమించినప్పుడు చంద్రబాబు నా వెనుక ఉండి ఉద్యమం నడిపించారా? నిధులు సమకూర్చారా? అని ప్రశ్నించారు. తన క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసి కూడా ఆరోపణలు చేయించడం మంచిది కాదన్నారు. ‘తప్పుడు ఆరోపణలు చేయించకండి. ధైర్యంగా ఢీకోండి. దీటుగా సమాధానం చెబుతా’అని చంద్రబాబునుద్దేశించి అన్నారు. ‘మీరిచ్చిన హామీల స్ఫూర్తితోనే రోడ్డెక్కాం. ఆఖరి దశలో మా జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉద్యమం చేపట్టాను తప్ప వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు.
ఇప్పటికైనా అబద్ధాలు మానండి
ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేశారు. అబద్ధాలు మానండి. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయండి. 2018 మార్చి ఆఖరు నాటికి ఇచ్చిన హామీలు పూర్తి చేయండి. అంతవరకూ ఉద్యమానికి తాత్కాలిక వాయిదా మాత్రమే. హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం తప్పదు’ అని ముద్రగడ అన్నారు. ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి మూడేళ్లకు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి కాపు జాతిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న కాపులకు కార్పొరేషన్ రుణాలు మంజూరు కాలేదని, రాజకీయాలు పక్కన పెట్టి అర్హులం దరికీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 6న అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న యావత్తు కాపు జాతి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.