బోండాకు ఇప్పుడు కాపులు గుర్తొచ్చారా..?
గుంటూరు: మంత్రి పదవి ఇవ్వక పోయే సరికి ఇప్పుడు నీకు కాపులు గుర్తొచ్చారా అని బొండా ఉమామహేశ్వరరావును కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. పీసీసీ కార్యదర్శి గోవిందు శంకర శ్రీనివాసన్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా లాంటి వారి చేత తమను నిత్యం తిట్టించటమే చంద్రబాబు లక్ష్యంగా ఎంచుకున్నారన్నారని ముద్రగడ ధ్వజమెత్తారు. అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులంతా చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు.
హక్కుల కోసం పోరాడుతుంటే, మద్దతు ఇచ్చిన వారితో తాము కలిసి పోయామని, ప్యాకేజీలకు అమ్ముడుపోయామని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డితో రాజకీయ అక్రమ సంబంధం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరూపించాలని సీఎం చంద్రబాబుకు ముద్రగడ సవాలు విసిరారు. లేకపోతే సీఎం పదవికి రాజీనామ చేయాలని డిమాండ్‌చేశారు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా కాపు ఉద్యమానికి ఏనాడూ సహకరించలేదని తెలిపారు. కాపు ఉద్యమానికి దూరంగా ఉన్న పవన్‌కళ్యాణ్ లాంటి వారిని బతిమిలాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. బొట్టు పెట్టి పిలవటానికి ఇది ఎవరి ఇంట్లోనో జరుగుతున్న పెళ్లి కాదన్నారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపాలని పవన్‌కళ్యాణ్‌కి గతంలో ఆహ్వానం పంపినా స్పందించలేదని పేర్కొన్నారు. కొంతమంది రానంత మాత్రన తమ ఉద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు.
సీఎం చంద్రనాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని , ఏటా రూ.వెయ్యికోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన చంద్రబాబు హామిలను తుంగలో తొక్కి కాపులను దారుణంగా మోసగించారని విమర్శించారు.