
నరసాపురం రూరల్: నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చిన సీఎం ఇప్పుడు ఎన్నికల వేళ దీక్షలపేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొన్నటి వరకు బీజేపీ నేతలను పొగిడిన చంద్రబాబు అభివృద్ధికి సహకరించలేదంటూ ఇప్పుడు దొంగ దీక్షలకు దిగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్నారు. సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రజల్ని తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసుకోవడం కోసం పాఠశాలలకు శెలవులిస్తున్నారని, ఈ ఏడాది 38 సెలవులివ్వడంతో బోధనకుంటుపడిందన్నారు. కలెక్టర్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విమర్శించారు.