అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లాలో ప్రారంభమైన మొహర్రం కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి.
కనిగిరి, న్యూస్‌లైన్: అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లాలో ప్రారంభమైన మొహర్రం కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. ఇమామే హసన్, ఇమామే హుస్సేన్, ఇమామే ఖాశిం వంశీయులను తలచుకుని షహదత్ నామా అల్‌విదాతో ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత పెదషరగత్తులో భాగంగా పీర్ల గ్రామోత్సవాలు నిర్వహించారు. కనిగిరిలో వివిధ మకాన్‌లకు చెందిన అక్బర్‌వలి, పొదిలి సాహెబ్, ఇమామే హుస్సేన్, బారాయిమామ్, గిద్దలూరు సాహెబ్ తదితర నామకరణాలున్న పీర్లను శోభాయమానంగా అలంకరించారు. మరుసటి రోజు వేకువజామున అగ్నిగుండ ప్రవేశం చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఇళ్లవద్దకు చేరుకున్న పీర్లు పూజలందుకున్నాయి.
సలాముల మహోత్సవం
మొహర్రం సందర్భంగా వివిధ మకాన్‌లకు చెందిన పీర్లు స్థానిక బొడ్డు చావిడి సెంటర్, పామూరు బస్టాండ్‌ల వద్ద సలాములు అందుకొనే ఘట్టం ఉత్సాహ భరితంగా సాగింది. సయ్యద్ మకాన్, పఠాన్ మకాన్, మంగలి మాన్యం చావిడులకు చెందిన పీర్లు.. శంఖవరం గ్రామాల పీర్లు ఒకే చోట చేరుకొని సలాములందుకున్నాయి. దీన్ని వీక్షించేందుకు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. జనవాహిని దెబ్బకు చర్చి సెంటర్‌లో దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం ఆయా మకాన్‌ల వద్దకు.. సాయంత్రం బావుల వద్దకు వెళ్లాయి. రాత్రికి అల్‌విదాయో ..అల్‌విదాషా.. ఏ హుస్సేనీ.. అల్‌విదా.. అంటూ ముజావర్లు విషాద గీతాలను ఆలపిస్తూ పీర్లను చావిడులకు తరలించారు. అలాగే మార్కాపురం, చీరాల, గిద్దలూరులో కూడా కూడా పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు.