సాక్షిప్రతినిధి, నల్లగొండ: పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞంలో చేపట్టిన తొలి ప్రాజెక్టుగా పులిచింతలకు గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టులతో లబ్ధిపొందే వారు ఎవరైనా, ముందుగా ముంపు బాధితుల బాగోగులగురించి ఆలోచించారు ఆ మహానేత. కానీ ఆయన ఆశయాలకు తూట్లు పొడిచిన కిరణ్ సర్కారు అసంపూర్తి ప్రాజెక్టుకు హడావిడిగా ప్రారంభోత్సవం చేస్తున్నది. ముంపు బాధితులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. అయినా, రాజకీయ లబ్ధిని మాత్రమే పరిగణనలోకి తీసుకునే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేళ్లచెర్వు మండల పరిధిలోని ఈ ప్రాజెక్టును ఇటువైపు నుంచి ప్రారంభిస్తే తెలంగాణవాదులు అడ్డుకుంటారన్న నిఘావర్గాల నివేదికల మేరకు గుంటూరు జిల్లా వైపు నుంచి ప్రారంభోత్సవం పెట్టుకున్నారు. ఇప్పటికే పలు విడతలు వాయిదా పడిన సీఎం కార్యక్రమం ఎట్టకేలకు శనివారం జరగనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులు మొత్తంగా పూర్తి కావడానికి కనీసం మరో ఆరునెలలైనా పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదేనా... పునరావాసం
పులిచింతల ప్రాజెక్ట్ పరిధిలో 13 ముంపు గ్రామాలుండగా, 13,544 ఎకరాల భూమి ముంపులో పోయింది. 6,722 కుటుంబాల వారు నీడను కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్నారు. కిష్టాపురం, నక్కగూడెం, రేబల్లె, తమ్మారం, శోభనాద్రిగూడెం, దొరకుంట, పీక్లానాయక్ తండా, వెల్లటూరు, మేళ్లచెరువు, అడ్లూరు, గుండెబోయినగూడెం, పెదవీడు, గుండ్లపల్లి మొత్తం 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో 7199 ఇళ్లకు గాను, కేవలం 4140 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉండగా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. చింతిర్యాల రెండవ పునరావాస కేంద్రానికి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయగా పనులు మొదలు కాలేదు. రేబల్లె, నెమలిపురి రెండవ పునరావాస కేంద్ర ఏర్పాటుకు స్థలసేకరణ కూడా పూర్తి కాలేదు. పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. మంచినీళ్ల ట్యాంకుల నిర్మాణం కొనసాగుతూనే ఉంది.
ముంపు గ్రామాలలో 18 సంవత్సరాలు నిండిన సుమారు 3వేల మంది యువతీయువకులకు 2012 సంవత్సరం వరకు పరిగణనలోకి తీసుకొని ప్యాకేజీ వర్తింపజేయాలని బాధితులు డిమాండ్ చేస్తుండగా, అధికారులు మాత్రం 2007 వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ అందజేస్తామనడంతో సమస్య పెండింగ్‌లోనే ఉంది. ప్రాజెక్ట్‌లో కేవలం 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే మొదటగా కిష్టాపురం, చింతిర్యాల, వెల్లటూరు, అడ్లూరు మునిగిపోతున్నందున ఆ గ్రామాలను వెంటనే ఖాళీ చేయాల్సి ఉంది. కానీ వీరికి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. పులిచింతల బాధితుల రేషన్ కార్డులను పునరావాస కేంద్రాల చిరునామాకు నేటి వరకూ మార్చలేదు. ప్రాజెక్ట్ కింద ముంపునకు గురవుతున్న 13,544 ఎకరాలలో ఇంకా 4 వేల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. నిర్వాసితుల ఇళ్లకు చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. పునరావాస కేంద్రాలలో *134 కోట్లతో ప్రస్తుతం అంతర్గత రహదారులు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
అసంపూర్తి ప్రాజెక్టు...ఆర్భాట ప్రారంభోత్సవం
Published Sat, Dec 7 2013 1:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement