పవర్‌లో ఉన్నాం కాబట్టే..
ఏలూరు (టూటౌన్) : ‘మేం అధికారంలో ఉన్నాం కాబట్టే పరిస్థితులను బట్టి వ్యవహరిస్తున్నాం.. లేకపోతే మీ కంటే ఎక్కువగా చేస్తాం.. మేం ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా’.. అంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరం వద్ద పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సీఐ ఓ దొంగతనం కేసులో 22 కాసులు బంగారం రికవరీ చేసి కేవలం 14 కాసులు మాత్రమే చూపించి రూ. లక్షా 44 వేలు విలువైన 8 కాసుల బంగారాన్ని స్వాహా చేశాడు. సదరు సీఐపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీస్ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రులో ఒక కేసుకు సంబంధించి ఎస్సైతో పాటు ఏలూరు డీఎస్పీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంతో డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇద్దరినీ సస్పెండ్ చేయించినట్టు బాపిరాజు తెలిపారు.
కోడిపందాలకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్యే గన్ని
సంక్రాంతి పండుగ సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహించే కోడిపందాలకు చట్టబద్ధత కల్పించాలని, అవసరమైతే పర్యాటక శాఖ ద్వారా ఇవి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు. ఆ నాలుగు రోజులు పందాలు ఆపడం ఎవరి వల్ల కాదని, అలా చేస్తే అరెస్ట్‌లు చేసినా కోడి పందాలు మాత్రం వేయకుండా మానరన్నారు. ఈ పందాల్లో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని గన్ని తెలిపారు.
కార్యకర్తల్లో మరింత చైతన్యం అవసరం : ఎమ్మెల్యే బండారు
ఇలాంటి ఘటనల్లో కార్యకర్తలు మరింత చైతన్యం తీసుకువచ్చి అక్రమ కేసులపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పోలీసులు ఓవరేక్షన్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లమూడి ప్రసాద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ద్వారకాతిరుమల ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్యకర్తలపై మురళీమోహన్ ఆగ్రహం
టీడీపీ నాయకుల, కార్యకర్తల ధర్నాలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కొందరు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా సందర్భంగా ద్వారకాతిరుమల మండలానికి చెందిన కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.