mullapudi bapi raju
-
బాపిరాజు ఇంటి వద్ద హైడ్రామా
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం ఈలి నానికి కేటాయించడంపై ముళ్లపూడి బాపిరాజుతో పాటు ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలూరులో బాపిరాజు తన నివాసంలో కార్యకర్తలు, నాయకులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. అలాగే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఇతర ముఖ్యనేతలతో కూడా రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలిసింది. బాపిరాజుకు ఈసారి సీటు కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ బాపిరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తాడేపల్లిగూడెం టిక్కెట్‌పై చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన , ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సీట్ల కేటాయింపు విషయంలో అభ్యంతరాలను తన దృష్టికి తీసుకురాకుండా సమావేశాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారనే అంశంపై జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలిసింది. -
తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(గురువారం) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధాన్ని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపించడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే. -
పవర్లో ఉన్నాం కాబట్టే..
ఏలూరు (టూటౌన్) : ‘మేం అధికారంలో ఉన్నాం కాబట్టే పరిస్థితులను బట్టి వ్యవహరిస్తున్నాం.. లేకపోతే మీ కంటే ఎక్కువగా చేస్తాం.. మేం ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా’.. అంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరం వద్ద పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సీఐ ఓ దొంగతనం కేసులో 22 కాసులు బంగారం రికవరీ చేసి కేవలం 14 కాసులు మాత్రమే చూపించి రూ. లక్షా 44 వేలు విలువైన 8 కాసుల బంగారాన్ని స్వాహా చేశాడు. సదరు సీఐపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీస్ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రులో ఒక కేసుకు సంబంధించి ఎస్సైతో పాటు ఏలూరు డీఎస్పీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంతో డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇద్దరినీ సస్పెండ్ చేయించినట్టు బాపిరాజు తెలిపారు. కోడిపందాలకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్యే గన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహించే కోడిపందాలకు చట్టబద్ధత కల్పించాలని, అవసరమైతే పర్యాటక శాఖ ద్వారా ఇవి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు. ఆ నాలుగు రోజులు పందాలు ఆపడం ఎవరి వల్ల కాదని, అలా చేస్తే అరెస్ట్‌లు చేసినా కోడి పందాలు మాత్రం వేయకుండా మానరన్నారు. ఈ పందాల్లో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని గన్ని తెలిపారు. కార్యకర్తల్లో మరింత చైతన్యం అవసరం : ఎమ్మెల్యే బండారు ఇలాంటి ఘటనల్లో కార్యకర్తలు మరింత చైతన్యం తీసుకువచ్చి అక్రమ కేసులపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పోలీసులు ఓవరేక్షన్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లమూడి ప్రసాద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ద్వారకాతిరుమల ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలపై మురళీమోహన్ ఆగ్రహం టీడీపీ నాయకుల, కార్యకర్తల ధర్నాలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కొందరు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా సందర్భంగా ద్వారకాతిరుమల మండలానికి చెందిన కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభివృద్ధిలో తాడేపల్లిగూడేనికి ప్రాధాన్యం
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభం తాడేపల్లిగూడెం రూరల్ : అభివృద్ధి, అధిక నిధులు కేటారుుంపులో తాడేపల్లిగూడెం మండలానికి ప్రాధాన్యం ఇస్తానని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి బాపిరాజు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారికి గుర్తింపు ఉంటుందన్నారు. నామినేటెడ్ పదవుల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో తెలిపారన్నారు. తనను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన తాడేపల్లిగూడెం మండల ప్రజలను జీవితంలో మరిచిపోలేనన్నారు. దీనిలో భాగంగానే జెడ్పీ చైర్మన్‌గా తొలి సంతకం అనంతరం బంగారుగూడెంలో రక్షిత మంచినీటికి రూ.5 లక్షలు కేటాయించి నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం మండలానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. వారంలో ఒక రోజు తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. తాను అందుబాటులో లేని సమయంలో సీసీని ఇక్కడ ఉంచే చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులను కూడా ఇక్కడకు తీసుకొచ్చి సమీక్షలు నిర్వహిస్తానని బాపిరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీపీ పరిమి రవికుమార్, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, సొసైటీ అధ్యక్షుడు పసల అచ్యుతం, ములగాల బాబ్జి, కొడవటి సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించండి అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కోరారు. అధికారులతో మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించిన ఆయన ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఇరిగేషన్, వెటర్నరీ, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, పంచారుుతీరాజ్, వ్యవసాయం, ఐసీడీఎస్, ఐకేపీ, రెవెన్యూ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ టి.శ్రీనివాసబాబు, ఏడీఏ పి.బుజ్జిబాబు, తహసిల్దార్లు పి.నాగమణి, మధుసూదనరావు, ఎంపీడీఓలు జి.రమణ, జీవీకే మల్లికార్జునరావు, పలు శాఖల అధికారులు, టీ డీపీ కార్యర్తలు పాల్గొన్నారు.