టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు(పాత చిత్రం)
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం ఈలి నానికి కేటాయించడంపై ముళ్లపూడి బాపిరాజుతో పాటు ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలూరులో బాపిరాజు తన నివాసంలో కార్యకర్తలు, నాయకులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. అలాగే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఇతర ముఖ్యనేతలతో కూడా రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలిసింది. బాపిరాజుకు ఈసారి సీటు కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ బాపిరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తాడేపల్లిగూడెం టిక్కెట్‌పై చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉండగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన , ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సీట్ల కేటాయింపు విషయంలో అభ్యంతరాలను తన దృష్టికి తీసుకురాకుండా సమావేశాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారనే అంశంపై జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment