అభివృద్ధిలో తాడేపల్లిగూడేనికి ప్రాధాన్యం
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు
మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్ : అభివృద్ధి, అధిక నిధులు కేటారుుంపులో తాడేపల్లిగూడెం మండలానికి ప్రాధాన్యం ఇస్తానని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
పార్టీ కార్యకర్తలు, అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి బాపిరాజు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారికి గుర్తింపు ఉంటుందన్నారు. నామినేటెడ్ పదవుల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో తెలిపారన్నారు.
తనను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన తాడేపల్లిగూడెం మండల ప్రజలను జీవితంలో మరిచిపోలేనన్నారు. దీనిలో భాగంగానే జెడ్పీ చైర్మన్‌గా తొలి సంతకం అనంతరం బంగారుగూడెంలో రక్షిత మంచినీటికి రూ.5 లక్షలు కేటాయించి నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం మండలానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. వారంలో ఒక రోజు తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు.
తాను అందుబాటులో లేని సమయంలో సీసీని ఇక్కడ ఉంచే చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులను కూడా ఇక్కడకు తీసుకొచ్చి సమీక్షలు నిర్వహిస్తానని బాపిరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీపీ పరిమి రవికుమార్, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, సొసైటీ అధ్యక్షుడు పసల అచ్యుతం, ములగాల బాబ్జి, కొడవటి సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించండి
అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కోరారు. అధికారులతో మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించిన ఆయన ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఇరిగేషన్, వెటర్నరీ, హెల్త్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచారుుతీరాజ్, వ్యవసాయం, ఐసీడీఎస్, ఐకేపీ, రెవెన్యూ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ టి.శ్రీనివాసబాబు, ఏడీఏ పి.బుజ్జిబాబు, తహసిల్దార్లు పి.నాగమణి, మధుసూదనరావు, ఎంపీడీఓలు జి.రమణ, జీవీకే మల్లికార్జునరావు, పలు శాఖల అధికారులు, టీ డీపీ కార్యర్తలు పాల్గొన్నారు.