ముంపుగ్రామాలకు వరద తాకిడి
బెల్లంకొండ
పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. నెల రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్టు పరిధిలో నీరు నిల్వ ఉండడంతో ముంపు గ్రామాలైన పులిచింతల, కోళ్లూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాలతండా, బోదనం, గోపాలపురం, కామేపల్లి గ్రామాలు నీటి దిగ్బంధనంలోనే ఉన్నాయి.
మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడం, అధిక వర్షాలు కురవడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముంపు గ్రామాల్లోకి పది అడుగుల మేర నీటిప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. నాలు గు రోజుల నుంచి అధికారుల సూచనల మేరకు కొన్ని కుటుంబాలు పునరావాస కేం ద్రాలకు వెళ్లగా మరికొంతమంది నిర్వాసితులు ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు.
ముంపు గ్రామాల్లో భారీగా పంట నష్టం
ముంపు గ్రామాల్లో సాగుచేస్తున్న పంటలు నీట మునిగాయి. దాదాపు 25 వేల ఎకరాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో నిర్వాసితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీటి మునకకు గురికాని పంటల్లో తీసిన పత్తిని ఇళ్లకు తెచ్చేందుకు రాకపోకలు నిలిచిపోవడంతో పంటలంతా వర్షం దెబ్బకు తడిచిపోయాయని వారు వాపోతున్నారు.
సహాయ చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు.. రాకపోకలు నిలిచిపోవడంతో కోళ్లూరు, గొల్లపేట గ్రామాల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులను పడవల ద్వారా రెవెన్యూ అధికారులు గొల్లపేట సమీపంలో ఉన్న గద్దలగోడు వరకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లలో వెంకటాయపాలెం వరకు తీసుకువస్తున్నారు. ఆదివారం నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో స్థానిక రెవెన్యూ అధికారి లక్ష్మీప్రసాద్, ఎస్‌ఐ మురళీమున్నా, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది ముంపు గ్రామాలకు వెళ్లి స్థానిక పరిస్థితులను సమీక్షించి ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వచ్చిన నిర్వాసితులకు ఆహారాన్ని సరఫరా చేశారు.