ముంపు ఒకరిది..మేలొకరికి! | Okaridimelokariki caved! | Sakshi
Sakshi News home page

ముంపు ఒకరిది..మేలొకరికి!

Published Thu, Nov 27 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

ముంపు ఒకరిది..మేలొకరికి!

ముంపు ఒకరిది..మేలొకరికి!

అచ్చంపేట :  ముంపు ఒకరికైతే.. మరొకరికి మేలు జరుగనుంది. ఓ ప్రాంత రైతులు నష్టపోతే మరోప్రాంత రైతులకు లబ్ధి చే కూరనుంది. మహబూబ్‌నగర్, నల్లగొం డ జిల్లాల మధ్య డిండి ఎత్తిపోతల పథకం విషయంలో ఇదే జరుగుతుంది. ఎస్‌ఎల్‌బీసీ, మిండ్ డిండి ఎత్తిపోతలతో పా టు జూరాల- పాకాల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా డిండికి నీళ్లను తీసుకొచ్చే ప్రతిపాదనలు జరుగుతున్నాయి.

కృష్ణానది మిగులు జలాల ద్వారా ఎస్‌ఎల్‌బీసీ, డిం డి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాట ర్ నుంచి 25 టీఎంసీల నీటిని నల్లగొండ జిల్లాకు తీసుకెళ్లి ఆరులక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. నక్కలగండి, లోయర్‌డిండి, మిడ్‌డిండిల కొత్త రిజర్వాయర్లతో పాటు పాత అప్పర్‌డిండి ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల అచ్చంపేట నియోజకవర్గంలోని 11గ్రామాలు, సుమారు 10వేల ఎకరాలు నీటిముంపునకు గురవుతున్నాయి.

భూములు కోల్పోయేది తామైతే.. నీళ్లు పొందేది వాళ్లా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే డిండి ఎత్తిపోతల తెరపైకి వచ్చింది. డిండి రిజర్వాయర్ ఎత్తు పెంపుపై ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
 
నష్టం మనది.. ఫలితం వారిదా?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్-1 అవుట్‌లెట్ నుంచి నక్కలగండి వద్ద 7.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీంతో అచ్చంపేట మండలం మర్లపాడుతండా, పాత్యతండా, కేశ్యతండా, జోగ్యతండా, మన్నెవారిపల్లి, సిద్ధాపూర్, దేవులతండాలకు చెందిన 2755 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. టన్నెల్ మట్టి డంప్‌యార్డు కోసం 450 ఎకరాల భూమిని ఇప్పటికే ఈ ప్రాంతవాసులు కోల్పోయారు.

లోయర్ డిండికి 6కి.మీ వెనుక 11 టీఎంసీల నిల్వసామర్థ్యం గల మిడ్ డిండి రిజర్వాయర్‌ను సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్నారు. ఇది జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కంటే పెద్దది. దీనివల్ల సిద్ధాపూర్, అనుబంధ తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 3వేల ఎకరాల భూములు కోల్పోనున్నారు. కొత్తగా నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌కు 16కి.మీ దూరం వెనుకభాగంలో అప్పర్ పాతడిండి ప్రాజెక్టు ఉంది. మిడ్‌డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఒక భారీలిఫ్ట్‌ను నిర్మించి పాతడిండికి నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం పాతడిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీలు కాగా, ఐదు మీటర్ల ఎత్తు పెంచి ఆధునికీకరించి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల వంగూరు మండలం గాజర, డిండి చింతపల్లి, నిజామాబాద్, చాకలి గుడిసెలు, ఉప్పునుంతల మండలం కొరటికల్లు గ్రామాలతో పాటు 3500 ఎకరాల భూములు మునిగిపోనున్నాయి.
 
ప్రతిపాదనలు ఇలా..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌కు లింక్ కలపడానికి శ్రీశైలం అప్పర్‌ప్లాట్ గుట్టల్లో భూగర్భ టన్నెల్, రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం జలయజ్జంలో రూ.2813కోట్లు కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 కి.మీ మేర సొరంగమార్గం తవ్వాల్సి ఉంది.

ఇప్పటికీ కేవలం 23.7కి.మీ మాత్రమే పూర్తయింది. కాగా, దీనికి అనుసంధానంగా రూ.5700 కోట్ల వ్యయంతో డిండి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పాత డిండి ప్రాజెక్టును ఆధునికీకరించి నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లోని మరో మూడులక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సర్వేలు ముగిశాయి.

ప్రస్తుతం పాత డిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీ కాగా, ఐదు మీటర్లు ఎత్తు పెంచి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. పాలమూరు జిల్లా పరిధి అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో 17వేల ఎకరాలు, కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, ఇర్విన్ మండలాల్లో 10వేల ఎకరాలు, అమ్రాబాద్ ఎత్తిపోతల ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఇదే నియోజకవర్గంలోని 20వేల ఎకరాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement