పాత తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో డిష్యూం డిష్యూం ఫైటింగ్‌లు అయిపోయాక పోలీసులు వచ్చి శుభం కార్డు పడటం అందరం చూసే ఉంటాం. ఆగ్రా పోలీసులు మాత్రం పెళ్లిళ్లలో చిట్టచివర్లో కాకుండా ముందే వస్తారు. అదీ కూడా పిలవకుండానే వచ్చి పెళ్లిలో అత్యంత కీలకమైన, విలువైన వధువు నగలు, పెళ్లివారి నగదు వంటి వాటిపై నిఘా పెడతారు. ఎందుకంటే వాటిని కొట్టేసేందుకు చోరశిఖామణులు పెళ్లి మండపాల్లో తచ్చాడుతారని పోలీసులుకు బాగా తెలుసు. అందుకే మఫ్టీల్లో వచి్చమరీ పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇదంతా ఉచితమే. ఇలా అదనపు మొహరింపు వెనక ఒక పెద్దకారణమే ఉంది. ఈ వివరాలను ఆగ్రా సిటీ డెప్యూటీ పోలీస్ కమిషనర్ సూరజ్ రాయ్ వెల్లడించారు.
టీనేజర్లూ డేంజరే
‘‘రాత్రిళ్లు దొంగలు పడటం సర్వసాధారణం. పట్టపగలు పెళ్లి పందిళ్లు, మండపాల్లో దొంగలు చేతవాటం చూపించడం ఈమధ్య మరీఎక్కువైంది. ముఖ్యంగా పెళ్లి నగలు, నగదుపై కన్నేసి కొట్టేసిన ఘటనలు చాలా జరిగాయి. అందుకే పోలీసు సిబ్బందిని సాధారణ దుస్తుల్లో వివాహవేడుకలకు బందోబస్తుగా మేమే పంపిస్తున్నాం. బంధువుల్లా కలిసిపోయి అందరిపైనా ఓ కన్నేస్తాం. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ముఖ్యంగా గమనిస్తాం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉండే నగలు, నగదునే దొంగలు కొట్టేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల సాయంతోనూ నిఘా కొనసాగుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రా జిల్లాలోని ప్రతి కీలకమైన వేడుకకు మేం పిలవకున్నా వెళ్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను గమనిస్తాం. కొన్ని సార్లు ఆ అనుమానాస్పద వ్యక్తుల వెంట వచ్చే టీనేజర్లనూ ఓ కంట కనిపెడతాం. ఎందుకంటే ఆ మధ్య ఒక పెళ్లిలో టీనేజీ పిల్లాడే కోట్లవిలువైన చోరీకి పాల్పడ్డాడు. పెళ్లిమంటపాలు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు ఇలా మొత్తం 18 క్లస్టర్లకు పోలీసులను పంపుతున్నాం. స్థానికులు సైతం తమ పెళ్లికి నిఘా కావాలంటే ముందస్తుగా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే ప్రతి పెళ్లికి కుదిరితే బందోబస్తును ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు. – ఆగ్రా
Comments
Please login to add a commentAdd a comment