
పురపోరు నామినేషన్ల జోరు
సాక్షి, ఒంగోలు: మున్సిపల్ నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఆయాచోట్ల ఒక్కో మున్సిపాలిటీకి 150కి పైగానే నామినేషన్లు దాఖలయ్యాయి. అన్నిచోట్లా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గిద్దలూరు మున్సిపాలిటీలో పలువురు బీఎస్పీ తరఫున నామినేషన్లు వేయడం గమనార్హం. అక్కడ మొత్తం దాఖలైన 183 నామినేషన్లలో బీఎస్పీ తరఫున 34 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణల పర్వం కొనసాగనుంది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీతో పాటు బీఎస్పీ తరఫున భారీగా నామినేషన్లు దాఖలుకాగా, బరిలో నిలవనున్న స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. ఈ మేరకు .. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు మున్సిపల్ పోరును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. తమ అనుచరవర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రత్యర్థుల్ని ఎన్నికల్లో ఓడించే వ్యూహాలు పన్నుతున్నారు.
ముందెన్నడూ లేని విధంగా చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. సమీప కాలంలో ఉన్న సార్వత్రిక ఎన్నికలకు ఈ స్థానిక ఎన్నికలు సెమీఫైనల్స్‌గా భావిస్తోన్న ప్రధాన పార్టీల నేతలు మున్సిపాలిటీల్లో విజయం కోసం అలుపెరగని శ్రమ చేస్తున్నారు.
ఎమ్మెల్యేలకు భారమైన
మున్సిపల్ పోరు..
సార్వత్రిక ఎన్నికలేమో గానీ.. స్థానిక ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనడం కత్తిమీద సాముగా మారిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నిన్నటి దాకా కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలు.. నేడు, ఆ పార్టీని వీడి సొంత కేడర్‌తో మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరవర్గాన్ని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించగా.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆయనకు దీటుగా పోటీనిచ్చేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ‘ఆమంచి’కి సన్నిహితంగా ఉన్న కేడర్ అంతా నేడు ఆయనకు దూరంగా మసలుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేని ఆయన .. ఎలాగైనా తాను నిలబెట్టిన వారిని గెలిపించుకుని తీరాలనే పంతంతో వ్యూహాలు పన్నుతున్నారు. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన రాజకీయ భవితవ్యంపై అభిప్రాయసేకరణలతో లెక్కలేసుకుంటూనే.. తన మద్దతుదారులను మున్సిపల్ ఎన్నికల్లో ‘బీఎస్పీ’ తరఫున నామినేషన్లు వేయించారు. అక్కడ్నే.. రాంబాబుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న పగడాల రామయ్య కూడా ‘హస్తం’ తరఫున కొందరితో నామినేషన్లు వేయించారు.
మిగతా మున్సిపాలిటీల్లో కూడా కొందరు వ్యూహాత్మకంగానే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి నిలిచారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం నామినేషన్ల దాఖలులో తలోదారిగా వ్యవహరించారు. తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం భరోసాతో కొందరు నామినేషన్లు వేయగా.. ఆయనకు సంబంధం లేకుండానే దామచర్ల జనార్దన్ వర్గం కూడా నామినేషన్ల దాఖలులో పోటీపడింది.పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా వర్గపోరును పెంచిపోషించడంలో తమదైన పాత్రకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్’
జిల్లాలో ఏ ఎన్నికలొచ్చినా.. వాటిని సమర్థంగా ఎదుర్కొనడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుంది. ఆ మేరకే, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఆపార్టీ తరఫున అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి తదితరులు మున్సిపల్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆయాచోట్ల క్రియాశీలక కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి బీఫాంలను కూడా అందజేశారు. ఏదిఏమైనా.. ఈ మున్సిపల్ పోరు ప్రధాన పార్టీల మధ్య రసవత్తరంగా సాగనుంది.