మున్సిపోల్స్‌కు బ్రేక్? | muncipal elections will be postpone? | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు బ్రేక్?

Published Wed, Aug 7 2013 4:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

muncipal elections will be postpone?

 కనిగిరి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన శాఖ ఉద్యోగులు విధులకు దూరం కానుండటంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయి. దీంతో ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకొంటుండగా..ఆశావహుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈనెల 12 నుంచి జేఏసీ ఉద్యోగ సంఘాలు పూర్తిస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా రూపకల్పన కూడా జరగలేదని సమాచారం. కనిగిరి నగర పంచాయతీలో ఈ కార్యక్రమం పూర్తయినప్పటికీ తదుపరి చర్యలు ముందుకు సాగలేదు.
 
 మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల పోలింగ్ కేంద్రాల నిబంధనలపై మున్సిపల్ కమిషనర్లకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. కానీ అది ఈనెల 12 తర్వాతకు వాయిదా పడింది. అంతేకాక చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన ఈనెల మొదటి వారంలో విడుదల కావాల్సి ఉన్నా.. నేటికీ రాలేదు. ప్రణాళిక ప్రకారం బుధవారం జరగాల్సిన రాజకీయ పార్టీల సమావేశం కూడా జరిగే అవకాశం లేదు. ఇన్ని అవాంతరాల నడుమ ఈనెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అనుమానమే. సెప్టెంబర్ 2 లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే కోర్టు ఆదేశాలు అమలయ్యేట్లు కనిపించడంలేదు.
 
 ముఖ్య నేతల్లో ఉపశమనం
 మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తుండటంతో ఆయా పార్టీల ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు తాత్కాలికంగా ఆగితే బావుండు అనే యోచనలో ఉన్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్‌లు కావడంతో ఎన్నికల నగదు, మద్యం సర్దలేక ఇక్కట్లు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల ఖర్చు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు కోట్ల రూపాయలు పెట్టి మళ్లీ సాధారణ ఎన్నికల్లో తామేం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
 
 ఆశావహుల్లో నిరుత్సాహం
 వార్డుల రిజర్వేషన్‌ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రకటనతో అన్ని పార్టీల్లోని ఆశావహులు పోటీల తీరుపై నిన్నటి వరకు లెక్కల్లో మునిగి తేలారు. చైర్మన్ అభ్యర్థులుగా ఉండాలనుకునే వారైతే ముఖ్య నేతలలో సంబంధం లేకుండా ఓసీ అయితే ఒక గ్రూపు ప్యానల్, ఓసీ మహిళ అయితే మరో గ్రూపు ప్యానల్, బీసీ, బీసీ మహిళయితే ఇంకొక  ప్యానల్‌గా గ్రూపులు చేసుకున్నారు. వార్డుల్లో కులాల వారీగా గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నులయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది.
 
 ఆర్‌జేడీ ఏమంటున్నారంటే..
 మున్సిపల్ శాఖ ఆర్జేడీ (గుంటూరు) శ్రీనివాస్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ అడగ్గా ఓటర్ల పోలింగ్ కేంద్రాలపై మంగళవారం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడిందన్నారు. ఎన్నికల విషయాలకు సంబంధించి కచ్చితంగా తానేమీ చెప్పలేనన్నారు. కాగా దీనిపై కనిగిరి కమిషనర్ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం బుధవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement