అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది ఆయన పదవీ విరమణ చేయనున్నారు. మూడు దశాబ్దాలుగా తాను అనుబంధం పెంచుకున్న నాతయ్యపాలెంలో రిటైర్ అయ్యాక స్థిరపడాలని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడిపేయాలని ఆయన ఆశించారు. ఆ ఆశయం నెరవేరక ముందే రోడ్డు ప్రమా దం రూపంలో మృత్యువు కబళించింది.
నెల్లూరు జిల్లా సూళ్లురుపేట సమీపంలో నాదెండ్లవారి కండిగ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కమిషనర్, నాతయ్యపాలెం వాసి పొలమరశెట్టి రామారావు(57) విషాదాంతమిది. చెన్నైలో బంధువుల ఇం ట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న వీరి వాహనం టైరు పంక్చర్ అయింది. రోడ్డుపక్కన చీకట్లో వాహనాన్ని ఆపి పరిశీలిస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావుతోపాటు అత ని చినబావమరిది కొడుకు వినయ్ చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన వాహనం డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు.
ఆపదలోనూ అదృష్టం
రామారావు కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనంలో ఆయన భార్య రామకుమారి, కుమార్తె రూప, ఆమె పిల్లలు సుమంత్, శ్యామ్, కోడలు ఉమామహేశ్వరి ఉన్నారు. చీకట్లో ఉన్న వాహనాన్ని, వీరిని వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ గమనించకుండా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యా రు. లారీ ఢీకొట్టిన ధాటికి ఇన్నోవా సమీపంలోని పొలాల్లోకి దూసుకుపోయింది. అయితే అందులో కూర్చున్న వారికి స్వల్పగాయాలు తప్ప ప్రాణాపాయం జరగలేదు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన సూళ్లూరుపేట వెళ్లారు.
క్లర్క్ స్థాయి నుంచి...
రామారావు క్లర్క్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా మున్సిపల్ కమిషనర్ స్థాయికి ఎదిగారు. గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, భీమవరం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. పదవీ విరమణ సమయం దగ్గర పడుతుండడంతో నాతయ్యపాలెంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని బంధువులు చెప్పారు. రామారావు కుమారుడు కిరణ్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, అల్లుడు భగవాన్ అధ్యాపకుడు. మృతి చెందిన వినయ్(19) ఎన్‌ఏడీ వాస్తవ్యుడు. అతడు విజయనగరం మహారాజా కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
విధి ఆడిన మృత్యుక్రీడ
Published Sat, Sep 28 2013 2:11 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement