నగర పాలక సంస్థ కమిషనర్‌గా సువర్ణ పండా దాస్ | Municipal Commissioner of the Golden Panda Das | Sakshi
Sakshi News home page

నగర పాలక సంస్థ కమిషనర్‌గా సువర్ణ పండా దాస్

Published Fri, Oct 25 2013 2:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

Municipal Commissioner of the Golden Panda Das

 

=జిల్లాకు సుపరిచితుడే..
 =ములుగు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం
 =విజయవాడ కమిషనర్ నుంచి వరంగల్‌కు బదిలీ

 
 కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా గొర్రెల సువర్ణ పండాదాస్ నియమితులయ్యారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న పండాదాస్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పండా దాస్ జిల్లాకు సుపరిచితుడే. 2008-2010 మధ్య కాలంలో ములుగు సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఈనెల 18 నుంచి ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్నారు. తాగునీటి వసతుల కల్పనపై జరుగుతున్న సెమినార్‌కు ఇజ్రాయిల్ వెళ్లిన ఆయన 26న తిరిగి రానున్నారు.
 
కుటుంబ నేపథ్యం ఇదీ..

తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలానికి చెందిన గొర్రెల ఇందిర, ప్రకాశ్‌రావ్‌ల కుమారుడు సువర్ణ పండాదాస్. ప్రకాశ్‌రావు.. ఎల్లవరం మాజీ ఎమ్మెల్యే. పండాదాస్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) చదివారు. బెంగళూరు ఐ.ఐ.ఎం పీజీ డిప్లొమో చేశారు. 2006 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన గుంటూరు జిల్లాలో శిక్షణ పొందారు.
 
పోస్టింగ్‌లు

ఐఎఎస్ శిక్షణ అనంతరం పండాదాస్ ములుగు సబ్ కలెక్టర్‌గా సూమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అనంతరం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టరుగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి బదిలీపై 2012 జూన్‌లో హైదరాబాద్ జల మండలిలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టరుగా పనిచేశారు. 2013 జనవరి రెండో వారంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీఅయ్యారు. సూమారు పది నెలల తర్వాత వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమితులయ్యారు. ములుగు సబ్‌కలెక్టర్‌గా పనిచేయడంతో జిల్లా భౌగోళిక, పరిపాలన, రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉంది. పండాకు షటిల్, టెన్నిస్, క్రికెట్‌పై మక్కువ. ముక్కుసూటితనం,  నిబంధనలు కచ్చితంగా పాటిస్తారనే పేరుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement