మున్సిపల్ 2014
మున్సిపల్ 2014
Published Tue, Mar 11 2014 2:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు ముహూర్తాలు కోసం వేచిచూస్తున్నారు. సోమవారం నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజున పలాస మున్సిపాలిటీలోని 22వ వార్డుకు ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది. మంగళ, బుధవారాల్లో దశమి, ఏకాదశి కావడంతో ఈ రెండు రోజులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు ఇప్పటికే ముహూర్తాలు పెట్టించడంలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆయా పార్టీల అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ మరోపక్క మంచి ముహూర్తం కోసం కూడా ఆరాలు తీస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీలతో పాటు, పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇచ్ఛాపురంలో 23, పలాసలో 25, ఆమదాలవలసలో 23, పాలకొండలో 20 వార్డులు ఉన్నాయి. నామినేషన్ దాఖలకు ఈనెల 14 వరకు గడువు ఉంది. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 18 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. 13, 14 తేదీల్లో కంటే 11, 12 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసేం దుకు మంచిదని పంచాంగకర్తలు చెబుతున్నారు.
బాబ్బాబు అప్పు చూసి పెట్టు..!
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అప్పుల వేటను ప్రారంభించారు. కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ లభించింది, లభిస్తుందన్న ఆశతో ఖర్చుల కోసం నిధుల సేకరణ ఆరంభించారు. ఎన్నికల నిబంధనలను ఓ సారి పక్కన పెడితే... కౌన్సిలర్‌గా పోటీ చేయాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు, ఎంపీటీసీకి అరుుతే, రూ.3లక్షల నుంచి రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. నామినేషన్‌లు వేసింది మొదలు చేతికి ఎముక లేదన్నట్లు వ్యవహరించాలి. అందుకే తెలిసిన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి ‘హలో.. తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేవారు ఉంటే చూడరాదూ...’ అంటూ పలువురు టికెట్ ఆశావహులు అభ్యర్థిస్తున్నారు. మరికొంత మందైతే నా స్థలాన్ని తాకట్టు పెడతా... అప్పు ఇప్పించూ.. అని అడుగుతున్నారు. మరికొందరు తమకున్ను స్థిరాస్తులను హోల్‌సేల్‌గా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులకు పండగే పండగ. ఎన్నికలా.. మజాకా..!
-న్యూస్‌లైన్, పూండి
Advertisement
Advertisement