Published
Tue, Mar 11 2014 2:18 AM
| Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
చాప చుట్టేశారు..!
పలాస, న్యూస్‌లైన్ :పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టే పరిస్థితికి వచ్చింది. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా వైఎస్సార్‌సీపీ, టీడీపీలో చేరుతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు కేంద్రమంత్రి డాక్టరు కిల్లి కృపారాణి చేసిన మంతనాలు పారడంలేదు. ఆమెకు అత్యంత సన్నిహితంగా నిన్నటి వరకు ఉన్నటువంటి 16వ వార్డు మాజీ కౌన్సిలరు గోళ్ల చంద్రరావు సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఇదివరకే 14వ వార్డు కౌన్సిలర్ రోణంకి శాంతికుమారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయూరు. ఇటీవల వరుసగా 5 సార్లు పలాస పట్టణానికి కృపారాణి వచ్చి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో సమావేశాలు జరిపారు. మున్సిపాలిటీలో చుట్టరికాలు చేస్తూ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పార్టీకి అండగా నిలవమని ప్రాథేయపడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆమె పాచికలు పనిచేయడం లేదు.
విభజన వాద కాంగ్రెస్ పార్టీలో ఉండలేమంటూ మొన్నటి వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మున్సిపల్ మాజీ వైస్ చైరపర్సన్ నాగరాణి పాత్రో, మాజీ కౌన్సిలర్ గుజ్జు జోగారావు, కాంట్రాక్టరు మీసాల సురేష్ వంటి వారు వైఎస్సార్ సీపీలో చేరిపోయూరు. మున్సిపల్ మాజీ చైరపర్సన్ లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కూడా ఊగిసలాడే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న హనుమంతు వెంకటరావు మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతున్నారు. ఇటీవల వెంకటరావు ఇంటిలో కృపారాణి నిర్వహించిన సమావేశానికి హాజరైన మాజీ కౌన్సిలర్లు ఇప్పుడు వారికి దూరంగా ఉండడమే దీనికి నిదర్శనం. 11వ వార్డు మాజీ కౌన్సిలర్ మల్లా కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని తన అనుచరుల వద్ద అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన ఏ పార్టీ త రఫున బరిలో దిగేది త్వరలో వెల్లడిస్తానని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, తన సోదరుడు మల్లా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభర్థిగా ఎంపిక చేస్తుందనే ఆశతో ఉండేవారు. ఇప్పు డు అవకాశం రాకపోవడంతో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందేహంతో ఉన్నట్టు సమాచారం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఈ సారి కాంగ్రె స్ తరఫున పోటీచేసి ఓడిపోవడం కంటే స్వతంత్రులుగా పోటీచేసి, గెలిచిన తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో కొందరు బలమైన అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. మున్సిపాలిటీలో ఈ సారి కాంగ్రెస్ తరఫున బరిలో దిగేం దుకు అభ్యర్థులు ముఖం చాటేయడంతో కృపారాణికి మిం గుడు పడడంలేదని సమాచారం.