మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం తీర్పుతో సర్కారులో కదలిక
ఎన్నికల నిర్వహణపై రేపు తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ ఎత్తుగడకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిబ్రవరి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును బుధవారం సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో వాటి నిర్వహణ తప్పనిసరైంది. దాంతో మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్ల ఖరారుకు అధికారులు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. మున్సిపల్ పాలక మండళ్ల గడువు ముగిసి (2010 సెప్టెంబర్) మూడున్నరేళ్లు రాజకీయ కారణాలతో ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తుండటం, ఆరు నెలలుగా అధికారులు ఒత్తిడి పెంచినా సర్కారు కాలయాపన చేస్తుండటం తెలిసిందే.
రాష్ట్రంలో 162 మున్సిపాలిటీలు, 19 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వాటిలో 145 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు తక్షణం ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కోర్టులు కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేయడంతో మరో మార్గం లేదని పురపాలక శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియపై మార్చి 3లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికిహైకోర్టు గడువిచ్చింది. మార్చి 3వ తేదీన కేసును కోర్టు విచారణకు చేపట్టనుంది. ఆ రోజు కోర్టు ఎలా స్పందిస్తుందా అని అధికారులు ఎదురు చూస్తున్నారు. 2011 జనాభా లెక్కలు వచ్చిన నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని 2013 ఫిబ్రవరి తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2013 జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయించిననేపథ్యంలో పరిస్థితులు ఎన్నికల నిర్వహణకు అనువుగా లేవంటూ ప్రభుత్వం వాయిదా వేసింది. సెప్టెంబర్‌లోనూ, డిసెంబర్‌లోనూ అలాగే రెండుసార్లు వాయిదా కోరింది. దీర్ఘకాలంగా ఎన్నికలు జరగక మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.2,500 కోట్ల గ్రాంట్లు ఆగిపోయాయి.
శుక్ర, శనివారాల్లో...?
చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను శుక్ర లేదా శనివారాల్లో ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిని ప్రకటించి ఎన్నికల సంఘానికి సమర్పిస్తే ప్రభుత్వ బాధ్యత తీరుతుందని యంత్రాంగం భావిస్తోంది.
రిజర్వేషన్లిస్తే మేం సిద్ధం: రమాకాంత్‌రెడ్డి
ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటిస్తే ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ల జాబితా తమకందిన నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మినహా ప్రభుత్వానికి మరో అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అయితే తమకంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే కొంత ఇబ్బంది ఉంటుందని ‘సాక్షి’కి ఆయన వివరించారు. రెండు ఎన్నికలకు పనిచేయాల్సిన సిబ్బంది, అధికారులు ఒకరేనని గుర్తు చేశారు. మార్చి 3న హైకోర్టు స్పందన ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు.
వారాంతంలో మున్సిపల్ రిజర్వేషన్లు!
Published Thu, Feb 27 2014 2:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement