పురపాలన @ఃఆన్‌లైన్
ఏలూరు :పురపాలనను పూర్తిస్థారుులో ఆన్‌లైన్ పట్టాలెక్కించే దిశగా పెద్దఎత్తున కసరత్తు సాగుతోంది. పౌర సేవలను విధిగా ఆన్‌లైన్ ద్వారానే అందించాలంటూ సర్కారు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఆదా యం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పురపాలక సంఘాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మునిసిపల్ శాఖ మంత్రి కె.నారాయణ ఇకనుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్షించనున్నారు. పన్నుల వసూళ్లు, చెత్త సేకరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, వీధిలైట్ల నిర్వహణ, మునిసిపల్ ఆస్తులతోపాటు ప్రతి అంశాన్ని అందరూ ఆన్‌లైన్‌లో చూసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సైతం నిత్యం ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయూల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1నుంచి ప్రతి సేవను ఆన్‌లైన్ ద్వారానే అందించే దిశగా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. ఇకపై ప్రతి పురపాలక సంఘాన్ని తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, తేడాలొస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఆస్తుల గుర్తింపునకు జియోట్యాగింగ్
జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాల కొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో పురపాలక సంస్థల ఆస్తులను గుర్తించేందుకు జియాట్యాగింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. ఖాళీస్థలాలు, పార్కులు, పాఠశాలలు, ఇతర మునిసిపల్ ఆస్తుల వివరాలను విస్తీర్ణంతో సహా జియోట్యాగింగ్‌లో నమోదు చేస్తారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఆసుపత్రులు, రోడ్ల వంటి సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరుస్తారు. ప్రతి ఆస్తికి ఒక నంబర్ కేటారుుస్తారు. తద్వారా ఆస్తుల ఆక్రమణలను ఉన్నతాధికారులు ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది.
పన్నుల వసూళ్లకు ‘ఈ-సువిధ’
పట్టణ ప్రజలు పురపాలక సంఘాల నుంచి సత్వర సేవలు పొందేందుకు వీలుగా ‘ఈ- సువిధ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో 18 అంశాలను చేర్చారు. ఇంటి పన్ను, ఆక్రమణ, ప్రకటన, వ్యాపార లెసైన్సు (డీ అండ్ వో ట్రేడ్స్), మంచినీటి పన్నులను ఇకపై ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. భవనాలకు సంబంధించిన ప్లాన్‌లను సైతం ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేస్తారు.
పారిశుధ్య కార్యక్రమాల
పరిశీలనకు ‘ఎంబిన్’
పురపాలక సంఘాల్లో చెత్త సేకరణ ఎలా సాగుతోందనే విషయూన్ని పరిశీలించేందుకు ఇకపై ఎంబిన్ విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం శానిటరీ సూపర్‌వైజర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. విధుల్లోకి వెళ్లిన సూపర్‌వైజర్ స్మార్ట్ ఫోన్ ద్వారా డంపర్ బిన్ ఫొటోను తీయాల్సి ఉంటుంది. అక్కడ చెత్తను తొలగిం చాక మరో ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయూలి. దీనివల్ల సూపర్‌వైజర్ పనిచేస్తున్నదీ లేనిదీ వెల్లడవుతుంది.
ఇక ఎల్‌ఈడీ వెలుగులు
పట్టణాల్లోని వీధుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ట్యూబ్‌లైట్లు, హైమాస్ట్ లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల్ని అమర్చాలని సర్కారు ఆదేశించింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ పని పూర్తి చేయూలని స్పష్టం చేసింది. అయితే బల్బులను పురపాలక శాఖ ఇస్తుందా లేక మునిసిపాలిటీలే కొనుగోలు చేయూలా అనేది స్పష్టం కాలేదు. విద్యుత్ బిల్లులను ఆదా చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పురపాలక శాఖ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో ఏలూరు నగరంతోపాటు అన్ని పట్టణాల్లో కలిపి 28,895 లైట్లు వెలగాల్సి ఉండగా, 28,032 లైట్లు పనిచేస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 97శాతం పనిచేస్తున్నాయని, ఇంకా 863 లైట్లు బాగు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అరుుతే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
అమలు బాధ్యత కమిషనర్లదే
మునిసిపాలిటీల్లో అమలు చేసే కార్యక్రమాలు, పౌర సేవలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సిన బాధ్యతను కమిషనర్లకు అప్పగించారు. ఇళ్లు, ఆస్తుల యజ మానుల ఆధార్ నంబర్ల సేకరణ, వీధిలైట్లు ఎన్ని ఉన్నాయి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఎన్ని జారీ చేశారు, కోర్టు కేసులు, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఏపీఎండీపీ) కార్యక్రమాలు, జియోగ్రాఫిక్ మ్యాపింగ్ సిస్టమ్, అర్బన్ హౌసింగ్, అర్బన్ స్కూల్స్, గోదావరి పుష్కరాలకు నిధులు ఏమేరకు వచ్చారుు, ఎంత ఖర్చు చేశారు, జేఎన్‌ఎన్‌ఎంఆర్‌యూ, స్వయం సహాయక సంఘాలకు రుణాల అందజేత, బిల్డింగ్ ప్లాన్‌ల పరిస్థితి, అభయహస్తం పింఛన్లు, స్మార్ట్ వార్డు కార్యక్రమం అమలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు తీరును కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.