ప్రజల సొమ్మును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని,ప్రజా పోరాటాల ద్వారా అవినీతిని ప్రతిఘటిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలియజేశారు.
చిలకలూరిపేట : ప్రజల సొమ్మును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని,ప్రజా పోరాటాల ద్వారా అవినీతిని ప్రతిఘటిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.3.50 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో మున్సిపల్ పాలకవర్గం ఏకపక్షంగా ఆమోదించడాన్ని నిరసిస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో ప్రతి పక్షం గొంతు నొక్కి, అధికారం ఉందన్న అహంకారంతో ఏకపక్షంగా రూ.3.50 కోట్ల పనులను టీడీపీ సానుభూతిపరులకు కట్టబెట్టారని విమర్శించారు.
నామినేషన్ పద్ధతిలో పనులను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ సభ్యులు పేర్కొంటున్నా, అధికారం ఉందనే కారణంతో పనులను ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సభలో చర్చించనప్పుడు సమావేశం నిర్వహించడం దేనికన్నారు. అధికార బలంతో ప్రతిపక్ష కౌన్సిలర్ల నోరు నొక్కేయాలని చూస్తే జనంలోకి వెళ్తామని, కోట్లాది రూపాయల అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. మూడున్నర కోట్ల పనులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్లు పిలిస్తే మున్సిపాలిటికి రూ.60 లక్షలు మిగిలేవని తెలిపారు. నామినేషన్ పద్ధతిలో కేటాయిచిన పనులు నిలిపివేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టరు, మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అప్పటికీ న్యాయం జరగ కపోతే న్యాయస్థానాన్ని అశ్రయించి న్యాయ పోరాటానికి సిద్దమౌతామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏఎంవీ సుభానీ అధ్యక్షత వహించారు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు నాయుడు శ్రీనివాసు, పార్టీ పట్టణ యువజన విభాగం కన్వీనర్ సాతులూరి కోటి, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తోట శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ అల్లీమియాలు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.