చినగార్లపాడు (కారంపూడి), న్యూస్‌లైన్: పొలం వద్ద నీరు పెట్టుకునే విషయమై తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి హత్యకు దారితీసింది. ఈ ఘటన చినగార్లపాడు గ్రామంలోని తంగెడ మేజర్ పక్క నున్న కటారువారికుంట పొలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల గోపాల్ (36) హత్యకు గురయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం.. వరి పొలానికి నీళ్లు పెట్టుకునే విషయమై గోపాల్‌కు, వేంపాటి బ్రహ్మారెడ్డికి మధ్య వివాదం నెలకొంది.
ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో గోపాల్ బ్రహ్మారెడ్డిని కొట్టడంతో, ఆయన ఇంటికి వెళ్లి మరికొందర్ని తీసుకుని పొలం వద్దకు వచ్చాడు. గోపాల్‌ను బరిసెలతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న గోపాల్‌ను సమీప పొలాల్లో ఉన్న అతని బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతిచెందాడు. ఈ సంఘటనతో గోపాల్ భార్య వెంకటరమణ, బంధువులు వందలాదిగా సంఘటనాస్థలానికి చేరుకుని విలపించారు.
గోపాల్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. హతుని తమ్ముడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి, మరో 13 మంది హత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశాడని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ, ముఠా తగాదాలు కారణం కాదని భావిస్తున్నామని, దర్యాప్తులో నిందితుల పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు.
గ్రామంలో ఉద్రిక్తత..
హతుడు గోపాల్ టీడీపీ నాయకుడు కావడంతో వివిధ గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు తరలివచ్చారు. గోపాల్ వర్గీయులు హత్యకు పాల్పడ్డారని భావిస్తున్న వర్గీయుల ఇళ్లపై దాడికి యత్నించారు. ఇళ్లలో మహిళలు, పిల్లలు మాత్రమే ఉండడంతో వారి జోలిక వెళ్లలేదని, లేకుంటే ప్రతీకార దాడి జరిగి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. కారంపూడి, దాచేపల్లి ఎస్‌ఐలు సురేంద్రబాబు, రమేష్‌బాబు, పోలీసు సిబ్బంది హత్య జరిగిన అరగంటలోపే గ్రామానికి చేరుకొని ఉద్రిక్తతను తగ్గించగలిగారు.
పొలం నుంచి గోపాల్ మృతదేహాన్ని సెంటర్‌కు తెచ్చే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకార నినాదాలు చేశారు. ట్రక్కులో వున్న మృతదేహాన్ని కొందరు పైకి లేపి గ్రామస్తులకు చూపే సమయంలో ఉద్వేగం చోటుచేసుకుంది. పూర్వం నుంచి వర్గపోరు నడుస్తున్న గ్రామం కావడంతో ఈ హత్య ఆ రంగు పులుముకుంటుందనే ఆందోళన నెలకొంది. గ్రామంలో పోలీస్ పికెట్ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి సీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చినగార్లపాడులో హత్య
Published Sat, Jan 25 2014 1:15 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement