సాక్షి, అనంతపురం: జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ముస్లింలు రంజాన్‌ను జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే అనంతపురం, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి తదితర పట్టణాల్లో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అంతా సుభిక్షంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించాలని వారు ఆకాంక్షించారు.
కర్నూలు: జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కట్టడి కి అందరు కలిసి కట్టుగా కృషి చేయ్యాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
తూర్పుగోదావరి: కాకినాడలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల వద్దే కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించుకున్నారు.
వైఎస్సార్ జిల్లా: రంజాన్ సందర్భంగా కమలాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ దగ్గరయిన ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి నవాజ్ ఈద్ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు.
విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment