శతాబ్దాలుగా వస్తున్న షరియత్ సంప్రదాయాన్ని కాదని, ఒక మహిళ జుమ్మా ప్రార్థనలు ప్రారంభించి, నూతన అధ్యాయానికి నాంది పలికింది. కేరళ మనప్పురం జిల్లాలోని వండూర్‌కి దగ్గరగా ఉన్న చేరుకోడ్ గ్రామంలో జుమ్మా ప్రార్థనలు నిర్వహించిన జమీదా నిజానికి ఓ టీచర్. ఈ పనికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిసి కూడా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సాక్షికి స్వయంగా తెలిపారు. ఆ వివరాలు...
ఇమామ్‌గా మారాలని ఎందుకు అనుకున్నారు? మారిన తరవాత మీకు ఎలా అనిపిస్తోంది?
ఖురాన్‌లో స్త్రీపురుష వివక్షను ప్రస్తావించలేదు. ‘ఇది మహిళల పని, ఇది పురుషుల పని’ అని ఎక్కడా లేదు.. మానవులు – ప్రేమ అనే అంశం మాత్రమే ఖురాన్‌లో ఉంటుంది. మహిళలు, పురుషుల గురించి ఖురాన్ ఏం చెప్పిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అందుకే ఇమామ్ అయ్యాను. ఇలా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంప్రదాయాలు, నమ్మకాల గురించి ముస్లిం మహిళలకు విపులంగా వివరించాను. ఖురాన్, అందులోని నమ్మకాలు, వాస్తవాలు, సమానత్వం గురించి తోటి మహిళలకు మరింత విపులంగా తెలియచేయాలనుకుంటున్నాను.
మీ కుటుంబ నేపథ్యం...
మా తల్లిదండ్రులు పదకొండుమంది సంతానంలో నేను ఆఖరిదాన్ని. నాకు ఇద్దరు పిల్లలు. నేను విడాకులు తీసుకుని పిల్లలతో జీవిస్తున్నాను. అమ్మాయికి 13 సంవత్సరాలు, ఏడో తరగతి క్యాలికట్‌లో చదువుతోంది. అబ్బాయికి ఏడు సంవత్సరాలు, రెండో తరగతి చదువుతున్నాడు. మా పెద్దలు నాకు ఇష్టం లేని వివాహం చేశారు. నేను ముస్లిం మహల్ కమిటీ (మసీదు)కి విడాకుల కోసం వెళ్లాను. అల్లా విడాకులు ఇష్టపడరని ముస్లిం పెద్దలు నన్ను తప్పుదోవ పట్టించారు. అలా చెప్పడంతో విడాకులు వెనకబడ్డాయి. పదిసంవత్సరాల తరవాత మహిళా తలాక్ సిద్ధాంతం ప్రకారం విడాకులు పుచ్చుకున్నాను. (1939 ఫసాఖ్ చట్టం) .నేను హదీసులను తిరస్కరించడం మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడే కాదు, నేను చిన్నతనం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాను.
ఖురాన్ సున్నత్ సొసైటీ ఏంటి?
ఖురాన్ సున్నత్ సొసైటీ అనేది మా సంస్థ. చేకన్నూర్ మౌల్వీ దీనిని స్థాపించారు. ఖురాన్ సన్నత్ సొసైటీ కేవలం ఖురాన్‌లో ఉన్న విషయాలను మాత్రమే చెబుతుంది. వాటికే కట్టుబడి ఉంటుంది. ఆయనను 1993లో మత ఛాందసులు చంపేశారు. 1400 సంవత్సరాలుగా పురుషాధిక్య మతంగా ఇస్లామ్‌లో పాతుకుపోయిన దురాచారం మీద ఈ సంఘం పోరాటం చేస్తుంది. ఖురాన్‌ను ఇష్టపడేవారిని మా సంస్థకు ఆహ్వానించి, మా సంస్థలో ఉన్న ముస్లిం మత పండితుల ఆధ్వర్యంలో... మా మార్గం లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
మిమ్మల్ని ఎవరైనా వ్యతిరేకించారా?
నేను ఇమామ్‌గా మారినందుకు ఎందరో మగవారు వ్యతిరేకించారు.
మీరు నిషేధించిన పుస్తకం గురించి...
16వ శతాబ్దంలో పొన్ననిలో జీవించిన షేక్ సైనుద్దీన్ మఖుమ్ రచించిన ఫత్ ఉల్‌ముయీన్ పుస్తకాన్ని బహిష్కరించారు. ఈ పుస్తకాన్ని అరబిక్ దేశాలలోను, భారతదేశంలోని మత సంస్థలలోను పాఠ్యాంశంగా పెట్టారు. ఈ పుస్తకంలో ముస్లిం యువకులను టెర్రరిజం వైపుకు నడిపే అంశాలు చాలా ఉన్నాయి. నేను చేసిన పనిని ఎవ్వరూ ప్రశంసించకపోగా, సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా నాపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
అమీను గురించి...
2016లో త్రివేండ్రంలో ఉన్న సమయంలో ఒక రోజున మహిళలకు ఖురాన్ బోధిస్తుండగా, ‘అమీన్’ అర్థం గురించి వివరించాను. నమాజ్‌లో ఆ పదం చెప్పలేదు. కొందరు ముస్లిం పెద్దలు నా క్లాసులో జరుగుతున్నదంతా రికార్డు చేశారు. తరవాతి వారం క్లాసు నడపడానికి వెళ్లాను. మసీదు కమిటీ సభ్యులు, కొన్ని ఇతర సంస్థలకు చెందిన కొందరు పురుషులు వచ్చి, నా తరగతి గదిని పగలగొట్టారు. నేను... యూదు యువతినని, ఇస్లామ్‌కి వ్యతిరేకినని నన్ను దూషించడంతో, ఒంటరినైపోయాను.
హదీసులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి...
మా కుటుంబ సభ్యులు నన్ను వెలివేశారు. అంటే ముర్తహాద్ అంటారు. ముర్తహాద్ అంటే హదీసులను బíß ష్కరించడం, ముస్లిం పండితుల మాటలను వ్యతిరేకించడం అని అర్థం. అదే సమయంలో నేను పని చేస్తున్న మూడు అరబిక్ కాలేజీల వారు కూడా నన్ను బహిష్కరించారు. నాకు ఆదాయం పోయింది. ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి చేరుకున్నాను. పిల్లల్ని చదివించడానికి కూడా డబ్బు లేదు, ఆ సమయంలో మా అమ్మ నాతో ఉంది.
ఎలా పోరాడారు...
సోషల్ మీడియా ద్వారా ముస్లిం పండితులను ఎదుర్కోవడం ప్రారంభించాను. ఆ సమయంలో ఖురాన్ సన్నత్ సొసైటీ సభ్యులు నన్ను కాలికట్ రమ్మని పిలిచారు. వారు పిలిచిన సమయంలో నేను ట్రిపుల్ తలాఖ్ (అఖిలా హదియా) గురించి ఒక టీవీ చానెల్‌లో చర్చలో పాల్గొన్నాను.
– డా. వైజయంతి
డిసెంబరు 11, 2017 రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు నన్ను చంపడానికి మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను కాలికట్ దగ్గర ఉన్న కప్పాడ్‌లో నివసిస్తున్నాను. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎస్‌ఐ వచ్చి వారిని అరెస్టు చేశారు. డిసెంబరు 22, 2017 రాత్రి 12.30కి మళ్లీ నా మీద హత్యాప్రయత్నం చేశారు. అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ఇప్పటికీ కొందరు ఛాందస సంస్థల పెద్దలు, నాయకులు నన్ను చంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగం లేదు. జుమాగా జీవిస్తున్నాను.
నాకు నచ్చిన మార్గంలో ఆనందంగా, హాయిగా ఉన్నాను.
– జమీదా
1999లో న్యూయార్క్‌లో మొట్టమొదటగా అమీనా వదాహ్, ఘజాలా అన్వర్‌లు జుమ్మా ప్రార్థనలు చేయించారు. భారతదేశంలో నేడు జమీదా టీచర్ తొలి అడుగు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment