అమెరికా పర్యటనలో ఎంవీవీఎస్ మూర్తి
సాక్షి, హైదరాబాద్ : అమెరికా రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన 1938 జూలై 3న తూర్పుగోదావరి జిల్లా మూలపొలం గ్రామంలో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందిన ఎంవీవీఎస్ మూర్తి గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విద్యాసంస్థలను ప్రారంభించారు. ఆయన మరణంతో మూలపొలం గ్రామంలో విషాదం నెలకొంది.
న్యాయవాదిగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన రెండుసార్లు ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మూర్తి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి తొలిసారి 1989లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు చెందిన ఉమాగజపతిరాజుపై గెలుపొందారు. 1999లో కూడా మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును బీజేపీకి కేటాయించడంతో.. ‘మూర్తి'ని ఎమ్మెల్సీగా సీఎం చంద్రబాబు నామినేటెడ్ చేశారు. (చదవండి: గీతం యూనివర్సిటీ అధినేత హఠాన్మరణం)
సంతాపం తెలిపిన వైఎస్ జగన్
గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment