‘గీతం’ మూర్తి బహిరంగ క్షమాపణ
మహానాడు వేదికపై ఎమ్మెల్సీతో క్షమాపణ చెప్పించిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ‘ఏయూ ఒక దెయ్యాలకొంప..’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ, గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, లక్షలాది మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విశాఖ ప్రజల మనోభావాలను గాయపర్చినందుకు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నానని ప్రకటించారు. మూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏయూ విద్యార్థి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడురోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
శుక్రవారం మహానాడు ప్రాంగణానికి వచ్చిన మూర్తి తాను అలా అనలేదని, మీడియా వక్రీకరించిందని బుకాయించడంతో మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మూర్తి వ్యాఖ్యల వీడియోలను ఆయనకు చూపించారు. ఆయనతో క్షమాపణలు చెప్పించాలని, లేకుంటే ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్సీ మూర్తిని పిలిపించి చీవాట్లు పెట్టి, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించారని పార్టీ వర్గాలు తెలిపాయి.