
24 గంటల్లోనే వీడిన మిస్టరీ
ఒక్క రోజులోనే ‘ఏటీఎం’ కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్టు, పిస్తోల్, ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన యూసుఫ్‌గూడ ఏటీఎం దోపిడీ కేసును నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి అతని నుంచి పిస్తోల్‌తో పాటు మూడు ఏటీఎం కార్డులు, బంగారు గొలుసు, చేతి ఉంగరం, ఐదు సెల్‌ఫోన్‌లు, బటన్ చాకు, హ్యాడ్ కర్చీఫ్, రూ.4,000 నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే ఆగంతకుడు వైయస్‌ఆర్ జిల్లా కు చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి అని గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. మదురానగర్‌లోని లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీలలిత గత బుధవారం ఉదయం యూసుఫ్‌గూడలోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా ఆగంతకుడు వచ్చి పిస్తోల్‌తో కాల్పులు జరిపి ఆమె నుంచి బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.
ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏటీఎంలో ఆగంతకుడి ఫుటేజ్‌లను పోలీసులు మీడియాతో పాటు స్థానికులకు, చుట్టుపక్కల పోలీసు స్టేషన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు చేశారు. అగంతకుడి ఫొటోలను గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయ ణ, రాజావెంకట్‌రెడ్డి, గంగారామ్‌లను రంగంలోకి దింపారు. అమీర్‌పేట్‌లో సా యిదుర్గా హాస్టల్‌లోని నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగం కోసం నగరానికి వచ్చి..
వైఎస్సాఆర్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి(24) ఉద్యోగం కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి సాయిదుర్గా హాస్టల్ ఉంటున్నాడు. ఉద్యోగం దొరకకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో 3 నెలల క్రితం ఓ వ్యక్తి సహాయంతో మహారాష్ట్రకు వెళ్లి రూ.25 వేలకు 9 ఎంఎం పిస్తోల్‌ను ఖరీదు చేశాడు. ఏటీఎం సెంటర్ దోపిడీకి ఒకరోజు ముందు అక్కడ రెక్కీ నిర్వహించి మరుసటి రోజు ఉదయం ఈ దోపిడీకి పాల్పడ్డాడు.
మరేమైనా నేరాలు చేశాడా?
అతని వద్ద శ్రీలలిత ఏటీఎం కార్డుతో పాటు మరో రెండు కార్డులు లభ్యంకావడంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి పిస్తోల్ ఎవరు ఇప్పించారు, ఈ దోపిడీలో మరెవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలని మహేందర్‌రెడ్డి అన్ని హాస్టల్స్ యాజమాన్యాలను ఆదేశించారు.