తాడిపత్రి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరం నాగిరెడ్డి బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తాడిపత్రిలో బుధవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు వైఖరిపై నిరసన వ్యక్తం చేసి, పార్టీకి గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. పులివెందులలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు పేరం గోకుల్‌నాథ్‌రెడ్డి, కోడలు పేరం సరోజమ్మ, పేరం కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పార్టీలో చేరారు. వీరి చేరికతో వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుంది.
రాజకీయ ప్రస్తానం.. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన పేరం నాగిరెడ్డి 1983లో తాడిపత్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడిపత్రి పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989లో ఆర్‌టీసీ రీజియన్ చైర్మన్‌గా పని చేశారు. 1995లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2009లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన.. నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ 30 సంవత్సరాల పాటు పార్టీని నడిపించారు. పేరం టీడీపీ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్‌సీపీలో చేరడంతో తాడిపత్రి ‘దేశం’లో అక్కడక్కడ మిగిలిన కార్యకర్తలు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
తాడిపత్రి ‘దేశం’లో అయోమయం
Published Thu, Dec 26 2013 3:19 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement