
నంది పండుగా? ఎంపీ వందిమాగధ వేడుకా?
రాజమండ్రి :రాజమండ్రిలో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు ఎంపీ మురళీమోహన్‌కు వందిమాగధ వేడుకల్లా కనిపిస్తున్నాయి. నాటకాల విరామ సమయంలో ఆయన రాజకీయపరంగా మాట్లాడడం, కొందరు నటులను పొగడడం, అక్కడ ఆయన మనుషులే పెత్తనం చేయడంతో ఎంపీ బృందం వ్యవహారంలా నంది నాటకోత్సవాలు కనిపిస్తున్నాయి. చివరకు ఆయన ఎన్నికల్లో ఆటోలో తమ పార్టీ తరఫున మైకు ప్రచారం చేసిన వ్యక్తిని తెచ్చి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు యాంకర్‌ను చేశారు. ఆ యాంకర్ పరుష పదాలతో మాట్లాడుతుండమేకాక.. కనీసం ఒక్కసారైనా వేదికపై రాజమండ్రి చరిత్ర, నాయకుల వివరాలు వంటివి చెప్పకుండా ఎన్నికల ప్రచారంలా యాంకరింగ్ చేయడంపై ప్రేక్షకులు, నాటకరంగ పెద్దలు, జ్యూరీ సభ్యులు అసహనానికి గురవుతున్నారు.
దీనిపై ఒక పెద్దాయన ప్రశ్నిస్తే ఆ కుర్రాడికి శిక్షణ ఇవ్వండని మురళీమోహన్ అన్నారు. ‘ఇప్పుడు ఈ యాంకర్‌కు శిక్షణ ఇవ్వాలా? ఇక్కడ జరుగుతున్నది రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలేనా?’ అని ఆ పెద్దాయన ముక్కున వేలేసుకున్నారు. కాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలుపుతూ ప్రదర్శితమైన ఓ నాటకంలో ఎంపీ పాత్రను ఆకాశానికెత్తుతూ, ఇతర రాజకీయ నాయకులను దుయ్యబట్టారు. ఎంపీ పాత్ర మురళీమోహన్‌ను పోలి ఉందని, ఇలాంటి నాటకాన్ని ప్రదర్శనకు ఎలా అనుమతించారని పలువురు విస్తుబోయూరు. ఇటువంటి నాటకానికి ఎంపిక చేసే జ్యూరీ ఎందుకు అనుమతి ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా నాటకం ప్రదర్శితమైన తర్వాత వారికి బహుమతులు అందించే సమయంలో ఎంపీ మురళీమోహన్ కొన్ని నాటకాలను ఎక్కువగా పొగుడుతున్నారు. ‘నాటకం బాగుంది. బాగా చేశారు’ అంటూ ప్రశంసిస్తున్నారు. మంగళవారం ఆయన ఇదే విధంగా ఓ నాటకం గురించి మాట్లాడుతుంటే ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు ఎస్.కె. మిశ్రో అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకం ప్రదర్శనపై ఎటువంటి పొగడ్తలను చెప్పవద్దని, అది జడ్జిలను ప్రభావితం చేస్తుందని, తర్వాత ఆ నాటకానికి బహుమతి వచ్చినా వివాదాలకు దారితీస్తుందని అన్నారు. ప్రదర్శనలపై ఎటువంటి కామెంట్లు చేయకూడదనే కనీస విషయం సీనియర్ నటుడైన ఎంపీకి తెలియదా అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
కానరాని ఎమ్మెల్యేలు, మేయర్
నాటకోత్సవాల ప్రారంభం రోజున మినహా ఇప్పటివరకు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి నాటకోత్సవాలు జరుగుతున్న ఆనం కళాకేంద్రం వద్ద కనిపించనే లేదు. ఎంపీకి ఇష్టమైన వ్యక్తులకు ప్రాధాన్యమివ్వడం, స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని పోకుండా నియంతలా వ్యవహరించడమే దీనికి కారణ మని తెలుస్తోంది. 2008లో జరిగిన నంది నాటకోత్సవాలు రాజకీయ పార్టీలకతీతంగా జరిగాయి. అందరూ సమన్వయంగా పనిచేసారు. ఈసారి టీడీపీ పెత్తనం చేస్తున్న వేడుకలానూ కాక కేవలం మురళీమోహన్ బృందం వ్యవహారంలా జరుగుతున్నాయి.
రిలయన్స్ దయా దాక్షిణ్యాలతోనేనా ఆధునికీకరణ?
నంది నాటకోత్సవాలను ప్రదర్శిస్తున్న ఆనం కళాకేంద్రం ఆధునికీకరణకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రూ.80 లక్షలు, ఆనం ఎలక్ట్రికల్స్ రూ.25 లక్షలు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎంపీ నిధుల నుంచి రూ.35 లక్షలు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రూ.15 లక్షలు ఇవ్వగా ఇంకా పలువురు దాతలు సాయం చేశారు. అయితే రిలయన్స్ సంస్థ ఒక్కటే సొమ్ములిచ్చినట్టు ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు.