- నందిగామ ఉప ఎన్నికకు ఆరు నామినేషన్లు
- భారీ పోలీస్ బందోబస్తు
- టీడీపీ తరఫున తంగిరాల కుమార్తె సౌమ్య
- కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి
నందిగామ :నందిగామ నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు బుధవారం తెలిపారు. 20వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 22వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాల మేరకు బోడపాటి బాబురావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరుగాక మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 9 సెట్ల నామినేషన్లు పడినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ బీఎస్.అనంత్ పరిశీలించారు.
భారీ పోలీస్ బందోబస్తు...
నామినేషన్ చివరి రోజు కావడంతో నందిగామ పట్టణంలో ఉదయం 9 గంటల నుంచే కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తూ ఆంక్షలు విధిం చారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు వస్తున్నారో పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. డివిజన్ స్థాయి పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసులను మొహరింపజేశారు.
ఉపసంహరణ గడువు ఈ నెల 30....
ఉపసంహరణ గడువు ఈ నెల 30న ముగియనుండటంతో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ వేసిన వారిని ఉపసంహరింప జేసేందుకు పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజులు సమయం ఉండటంతో ఏదో ఒక రకంగా చక్రం తిప్పి ఏకగ్రీవం చేసుకుందామనే కృతనిశ్చయంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు అన్ని స్థాయిల్లోనూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
నందిగామ: నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు బుధవారం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా, అధినాయకత్వ నిర్ణయానికి కట్టుబడి పోటీచేయడం లేదన్నారు. ఉప ఎన్నికల్లో పోటీచేయాలని మండల, గ్రామ స్థాయి నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గత సంప్రదాయాలకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు నడచుకోవాలని కోరారు.