
ఆ జాబితా ప్రకారమే నంద్యాల ఉప ఎన్నిక
♦ జనవరి 1 నాటికి 18 సంవత్సరాలున్న వారికే ఓటు హక్కు
♦ సీఈవో భన్వర్‌లాల్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఈ ఏడాది జనవరి 1వ తేదీన ప్రచురించిన ఓటర్ల జాబితా మేరకే జరుగుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఆగస్టు 5వ తేదీ కన్నా పది రోజుల ముందు దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పక్క నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను నంద్యాల నియోజ కవర్గంలో చేర్పించారనే ఆరోపణలున్నం దున నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలను రెండుసార్లు తనిఖీకి (డబుల్ వెరిఫికేషన్) ఆదేశించామన్నారు.
ఈ ప్రక్రియ కొనసాగుతోందని, పక్క నియోజకవర్గాల ఓటర్లు ఉంటే వారి పేర్లు తొలగిస్తామ ని శుక్రవారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పోలింగ్ రోజు ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను ఉద్యోగులు, అధికారులు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కర్నూలు జిల్లా అంతటా అమల్లో ఉంటుందని, ఇది ఈ నెల 27వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు.