
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు కొత్త సీఈవోగా ఎవరిని నియమిస్తుందనేది ఐఏఎస్ అధికారుల్లో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు, విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా కొనసాగారు.
ఏడేళ్ల పాటు ఆయన ఇదే పదవిలో ఉన్నారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా సీఈవోలను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తొలి సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అనుభవ మున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఇందులో ముఖ్య కార్యదర్శులు శశాంక్ గోయల్, రజత్‌కుమార్, నవీన్ మిట్టల్‌ల పేర్లు ఉన్నాయి.
కాగా, గతంలో ఎలక్షన్ కమిషన్ అదనపు సీఈవోగా పని చేసిన రజత్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఈవోగా నియమించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో సీనియర్ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్ పేరును కూడా చేర్చి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత వారంలోనే సూచించింది. దీంతో ప్రభుత్వం సవ్యసాచి ఘోష్‌తో పాటు శాలిని మిశ్రా, వికాస్‌రాజ్ పేర్లను సైతం ఈ జాబితాలో చేర్చింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మొత్తం ఆరుగురి పేర్ల ప్యానెల్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భన్వర్‌లాల్ తరహాలో రెండు రాష్ట్రాల సీఈవో బాధ్యతలు అప్పగిస్తే తప్ప, కేవలం తెలంగాణ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు సవ్యసాచి ఘోష్ సుముఖంగా లేనట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు సవ్యసాచి ఘోష్ లేదా రజత్‌కుమార్‌కు కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment