
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఈవో నియామకానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం విడిపోకముందు నుంచే గత ఏడు సంవత్సరాలుగా భన్వర్‌లాల్ సీఈవోగా కొనసాగుతున్నారు. విభజన అనంతరం ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు ఆయనే సీఈవోగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో ఆఫీసును వేరు చేయకపోవటంతో కొత్త రాష్ట్రమైన తెలంగాణకు భన్వర్‌లాల్ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక సీఈవో నియామకంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భన్వర్‌లాల్ పదవీ విరమణ చేయగానే.. తెలంగాణకు సీఈవో కార్యాలయంతో పాటు కొత్త సీఈవో నియామకంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలి సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు అనుభవజ్ఞులైన ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్రభుత్వం ప్యానెల్‌ను రూపొందించింది.
ఈ ప్యానెల్‌లో ముఖ్య కార్యదర్శులు శశాంక్ గోయల్, రజత్ కుమార్, నవీన్ మిట్టల్ పేర్లున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనల ఫైలు ముఖ్యమంత్రి వద్దకు రాగా, ఆయన సూచనల మేరకు సిద్ధం చేసిన తుది ప్యానెల్‌ను ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. సీఈసీ ఆమోదం మేరకు కొత్త సీఈవో నియామకం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment