
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న పాస్టర్ ఎబినైజర్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీసు అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో బుధవారం రాజకుమారి పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మద్దూరులో నివాసం ఉంటున్న ఎబినైజర్ ను తక్షణమే అరెస్ట్ చేసి అతని దగ్గర బందీలుగా ఉన్న మహిళలను విడిపించాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ను ఫోన్లో ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన అనంతరం ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎబినైజర్ పరారీలో ఉన్నాడు.