చినబాబు స్కీం రూ. 300 కోట్ల స్కాం | Nara Lokesh Rs. 300 crore scam | Sakshi
Sakshi News home page

చినబాబు స్కీం రూ. 300 కోట్ల స్కాం

Published Tue, Oct 9 2018 3:18 AM | Last Updated on Tue, Oct 9 2018 3:18 AM

Nara Lokesh Rs. 300 crore scam - Sakshi

వెటర్నరీ కాలేజ్‌ ఆధీనంలో ఉన్న లైవ్‌స్టాక్‌ యూనిట్‌లోని భూమి ఇదే

విజయవాడ: రాజధానిలో మరో భూ పందేరానికి తెరలేచింది. రూ.300 కోట్ల విలువైన భూమిని తమ అస్మదీయ కంపెనీకి కట్టబెట్టేందుకు చినబాబు డైరెక్షన్‌లో రంగం సిద్ధమైంది. దీంతో చేసేది లేక అధికారులు గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల స్థలాన్ని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేయడానికి చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ స్థలం ఇవ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ వెటర్నరీ కశాశాలకు ప్రభుత్వం విడతల వారీగా 125 ఎకరాలు కేటాయించింది.

ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తోంది. లైవ్‌స్టాక్‌ యూనిట్‌ కోసం కేసరపల్లిలో ఆర్‌ఎస్‌ నెం.20లో ఉన్న 66 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమిని ప్రభుత్వం 1994లో ఈ కళాశాలకు కేటాయించింది. ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీ వారు లైవ్‌స్టాక్‌ యూనిట్, రెండు ఫిష్‌ ట్యాంకులు, గుర్రాలశాల, పశువుల షెడ్లు నిర్మించారు. ఇప్పుడీ స్థలంపైనే చినబాబు కన్నుపడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని వెనక్కు తీసుకుని.. తిరిగి దానిని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు స్కెచ్‌ వేశారు. చినబాబు నిర్ణయానికి అనుగుణంగా ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ సదరు ఐటీ సంస్థ రెవెన్యూ శాఖకు విజ్ఞప్తి చేసింది. వెంటనే చిన్నబాబు నుంచి రెవెన్యూ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లడం.. ఫైళ్లు చకచకా కదలడం ప్రారంభమైపోయింది. 

చినబాబు ఒత్తిడితో మెత్తబడిన అధికారులు.. 
వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల భూమిని ఐటీ కంపెనీకి కట్టబెట్టాలని చినబాబు నుంచి జిల్లా యంత్రాంగానికి రెండు నెలలుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దాంతో జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం రంగప్రవేశం చేసి దానిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయమై కిందిస్థాయి అధికారులతో చర్చించారు. వారు యూనివర్సిటీ అధికారులతో చర్చించినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఆ స్థలాన్ని ఐటీ కంపెనీకి ఇవ్వాలని.. ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి స్థలం కేటాయిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఆ స్థలాన్ని వదిలిపెట్టేందుకు వెటర్నరీ అధికారులు విముఖత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో చినబాబు యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి పెంచారు. దాంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని అప్పగించేందుకు యూనివర్సిటీ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ విషయం బయటకు పొక్కితే కళాశాల విద్యార్థులు ఆందోళన చేస్తారనే భయంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గోప్యంగా స్వాధీనం చేసుకుందామని ఆలోచిస్తున్నారు.

ఇక్కడ ఎకరం రూ.4కోట్లు 
కాగా, జాతీయ రహదారి, విమానాశ్రయం, ఐటీ పార్కు పక్కనే ఉన్న ఈ భూమి పరిసర ప్రాంతాల్లోని ఆర్‌ఎస్‌ నెం.14, 15, 16 సర్వే నెంబర్లలో ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే సుమారుగా ఆ భూమి విలువ రూ.300కోట్లు. అలాగే.. ప్రభుత్వ మార్కెట్‌ విలువ రిజిస్ట్రేషన్‌ రికార్డులలో ఎకరం రూ.1,57,75,000గా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఎకరం రూ.10కోట్లు పలికింది. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఎకరం కనీసం రూ.4కోట్లకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ఆర్టీసీ స్థలం మాదిరిగా లాక్కునే యత్నం 
మరోవైపు.. వెటర్నరీ కాలేజీ స్థలం 66 ఎకరాలకు ఆనుకుని ఆర్టీసీ ఆధీనంలో ఉన్న 28 ఎకరాలను రెవెన్యూ అధికారులు కొద్దినెలల క్రితం ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. ఆర్జీసీ జోనల్‌ డ్రైవింగ్‌ శిక్షణా కళాశాల నడుస్తున్న ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని  హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహించుకునేందుకు ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో దానిని తాత్కాలికంగా భవానీపురానికి తరలించారు. ఈ స్థలంలోనే సోమవారం రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌ ఐటీ సంస్థలకు భూమి పూజచేశారు. ఇదిలా ఉంటే..  రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఎందుకూ పనికిరాని కొండగట్లు చూపిస్తుండటం కొసమెరుపు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement