బెంగళూరు కేంద్రంగా స్కెచ్!
► నెల రోజుల నుంచి పక్కా ప్రణాళిక
► 15 రోజుల నుంచీ దుండగుల రెక్కీ
► దాడిలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువకులే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య అంతా పకడ్బందీగా సాగింది. దాదాపు నెల రోజుల నుంచి ప్రత్యర్థులు ఆయన హత్యకు పథక రచన సాగించినట్టు సమాచారం.ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. హత్యకు 15 రోజుల నుంచి రెక్కీ నిర్వíßహించిరట్లు సమాచారం. స్థానికంగా ఉండే వారు ఇంత పకడ్బందీగా హత్యకు స్కెచ్ వేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఇక హత్యలో పాల్గొన్న వారిలో అత్యధికులు యువకులే ఉన్నారని సమాచారం. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఎంచి మరీ అధికారపార్టీ నాయకులు సమీకరించినట్లు వినిపిస్తోంది. ఇసుకఅక్రమ తవ్వకాలు, రవాణా వ్యవహారాలలో పెద్దమొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్న యువకులు ఎక్కువ మంది నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకున్నారని సమాచారం. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండడం, తవ్వకాలు ఆగిపోవడంతో వీరి ఆదాయానికి గండిపడిందని, కేసు వేసిన వారి వెనుక నారాయణరెడ్డి ఉన్నారన్న అపోహతో వారు ఆయనపై కక్ష పెంచుకున్నారని వినిపిస్తోంది. అయితే అటువంటి వారందరినీ సమీకరించి నారాయణరెడ్డిపై ఎగదోయడంలో తెలుగుదేశం నాయకులు సఫలమయ్యారని, వారే హత్యకు స్కెచ్ నుంచి అన్నీ సమకూర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాల్ డేటా కీలకం..!: హత్య అనంతరం ఆ సంఘటనలో పాల్గొన్న పలువురు యువకులు.. కొద్ది మంది నేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల కాల్ డేటాను పరిశీలిస్తే హత్య వెనుక సూత్రధారుల వివరాలు కూడా బైటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా నారాయణ రెడ్డి హత్య అనంతరం కొన్ని గ్రామాల్లో కొద్ది మంది సంబరాలు చేసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ ఆరా తీస్తే కేవలం సంఘటనలో పాల్గొన్న వారే కాకుండా అసలు నిందితుల వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
కల్వర్టు పనులెందుకు ఆగాయి?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నారాయణరెడ్డి హత్యకు పథక రచన పక్కాగా జరిగిందనడానికి కల్వర్టు పనుల నిలిపివేత కూడా నిదర్శనంగా నిలుస్తోంది. ఆదివారం నారాయణరెడ్డి ఈ దారిలో వెళతారని పసిగట్టిన ప్రత్యర్థులు భారీ పథకాన్నే రచించారు. ఆదివారం ఇక్కడ జన సంచారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్డు, కల్వర్టు పనులు కూడా జరగవు. పైగా, ఇక్కడ పైపులు ఉండటం వల్ల దాడి సులువు అవుతుంది. బాధితులు తప్పించుకొనేందుకు కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే, అంతకు నాలుగు రోజుల ముందే రోడ్డు, కల్వర్టు పనులు నిలిచిపోయాయి. పథకంలో భాగంగానే ఈ పనులు నిలిపివేశారని నారాయణ రెడ్డి అనుచరులు అంటున్నారు. ఈ పనులు జరుగుతుంటే దాడికి అవకాశం ఉండేది కాదు. భారీ స్కెచ్‌తో దాడికి దిగాలంటే ముందుగా రెక్కీ నిర్వహించాల్సిందే. ఇక్కడ పనులు జరుగుతుంటే రెక్కీకి అవకాశం ఉండదు. అందువల్లే దాడికి నాలుగు రోజుల ముందునుంచే పనులు నిలిపివేయించి, రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న పైపులను ఆసరాగా చేసుకొని దాడికి పాల్పడ్డారని అంటున్నారు. పనుల నిలిపివేతతో దాడి చేసిన వారు పైపుల్లో, వాటి వెనుక నక్కి ఉండే అవకాశం కలిగింది. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ముందుగానే పనులు నిలిపివేయించారని, దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉందని నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.