
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ నెల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతంలోని రైల్వే గ్రౌండ్స్‌లో బీజేపీ ఏపీ శాఖ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 10న ఆయన గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభతో పాటు వారం కిందట పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమండ్రి పర్యటనలో ఆశించిన స్థాయిలో జనం తరలిరావడంతో.. విశాఖ సభకు లక్ష మంది దాకా హాజరవుతారని పార్టీ నేతల అంచనా.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజులుగా విశాఖలో మకాంవేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో కంభంపాటి హరిబాబు లోక్‌సభ సభ్యుడిగా, విష్ణుకుమార్‌రాజు ఎమ్మెల్యేగా, పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు వారు కృషిచేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే భారత్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని సభ వాయిదా పడే అవకాశాలేమైనా ఉన్నాయా.. అని కూడా పార్టీ ముఖ్యులు అనుమానిస్తున్నారు.