ఏపీ చాయ్‌వాలాలతో మోడీ ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే రకరకాలుగా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ బృందం మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. వెబ్ కాస్టింగ్ ద్వారా అనుసంధానించిన 3డీ టెక్నాలజీతో ఓటర్లను ఆకట్టుకోనుంది. నరేంద్రమోడీ జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని 300మంది టీస్టాల్ యజమానులు లేదా చాయ్‌వాలాలతో ముచ్చటించనున్నట్టు తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతిలో అత్యధిక టీ స్టాళ్లను గుర్తిస్తారు. ప్రతి జిల్లాలో ఐదింటికి తగ్గకుండా చూస్తారు. ఆ టీస్టాళ్లలో మోడీ తరఫున పని చేస్తున్న ‘నమో ఇండియా’ వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. దానిద్వారా మోడీతో పలువురు చాయ్‌వాలాలు ఒకేసారి మాట్లాడవచ్చు. హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి సదస్సు జయప్రదమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆంధ్రానుంచే ప్రారంభించాలని మోడీ భావించినట్టు తెలిసింది.