
సాక్షి, అమరావతి: ఆంధ్ర కశ్మీర్ అరకు మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. జాతీయ రహదారితో ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మార్గంలో మరో జాతీయ రహదారి 516–ఈను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాజమహేంద్రవరం నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లోని రంపచోడవరం, కొయ్యూరు, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్.కోట మీదుగా విజయనగరం వరకు రెండు వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు గాను కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
గిరిజన గ్రామాల మీదుగా నిర్మాణం జరిగే ఈ జాతీయ రహదారితో తెలంగాణ నుంచి విశాఖ, విజయనగరం జిల్లాలకు మధ్య దూరం తగ్గనుంది. భద్రాచలంకు ఈ ఏజెన్సీ ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈ జాతీయ రహదారి వెసులుబాటుగా ఉంటుంది.