అంబేద్కర్ అందరివాడు
►వీసీ డాక్టర్ తులసీరాందాస్
►జేఎన్‌టీయూకేలో జాతీయ మహాసభ
మెయిన్‌రోడ్(కాకినాడ): కులరహిత సమాజానికి పాటుపడి అందరివాడుగా భారత రాజ్యాంగపిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎనలేని కీర్తిని సంపాదించారని జేఎన్‌టీయూకే ఉపకులపతి డాక్టర్ తులసీరాందాస్ పేర్కొన్నారు. వర్సిటీ క్రీడాప్రాంగణంలో జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో ఆదివారం ‘అంబేద్కర్ అందరివాడు’ జాతీయ మహాసభ నిర్వహించారు. మాల, మాదిగ ఉపకులాల గిరిజన అభివృద్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు బొర్రా విజయ్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథి వీసీ తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి, వర్థంతి సందర్భాల్లో కాకుండా సాధారణమైన రోజుల్లో ఇటువంటి సభ నిర్వహించడం ముదావహమన్నారు.
ఎటువంటి సౌకర్యాలు, రిజర్వేషన్లు లేని కాలంలో అంబేద్కర్ అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. తాను పడిన అవమానాలు బడుగు వర్గాలవారు పడకూడదని రిజర్వేషన్ల ద్వారా సమానత్వం కల్పించారన్నారు. పవన్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రూపాయి విలువ తెలిిపిన ఆర్థికవేత్తని పేర్కొన్నారు. ఆహార భద్రత, ప్రాథమిక విద్య హక్కుపై రాజ్యాంగంలో విలువైన సమాచారం పొందుపరచారన్నారు.
గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొఫెసర్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, డీఏపీ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్, డై త్రీ పీఅండ్‌టీ డాక్టర్ జేవీఆర్ మూర్తి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.పద్మరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుబ్బారావు, ఎస్సీ,ఎస్టీ జేఎన్‌టీయూకే కో-ఆర్డినేటర్ డాక్టర్ వి.శ్రీనివాసులు, మదర్ ఇండియా సంస్థ చైర్మన్ పిల్లి తిరుపతిరావు, అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్ తదితరులు వేదికను అలంకరించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి.శ్యామ్‌కుమార్ పర్యవేక్షించారు.