దేశ సేవకు కదలిరండి
విద్యానగర్(గుంటూరు): ఆత్మ విశ్వాసం, సేవా తత్పరత వంటి లక్షణాలు ఎన్‌సీసీ శిక్షణ పొందే విద్యార్థులకు అలవడతాయని ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ యోగేష్ శామ్యూల్ చెప్పారు. కష్టపడే తత్వం, తోటి వారికి సాయపడటం క్రమశిక్షణ గల కేడెట్ల ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఆంధ్ర బెటాలియన్ 66వ ఎన్‌సీసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
25వ బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శామ్యూల్ పరేడ్‌లో కేడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దేశసేవకు ముందుకు రావాలని కోరారు. కల్నల్ చౌహాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఎన్‌సీసీ దోహదపడుతుందని, ఎన్‌సీసీలో అధ్యాపకులు నేర్పే పాఠాలు గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, సంకల్పబలం కలిగించే విధంగా ఉంటాయని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా కేడెట్లు ప్రదర్శించిన విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్‌లు, ఏఎన్‌వోలకు బహుమతులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ప్రతిభావంతులు వీరే..
నేషనల్ గేమ్స్ కబడ్డీ విభాగంలో.. కె.నాగముని(నరసారావుపేట), షేక్ ఇబ్రహీం(కంభం), కె.మాణిక్యాలరావు (ఏఎన్‌యూ). హాకీలో వి.రాఘవ(ఒంగోలు), బ్యాడ్మింటన్‌లో కె.శ్రీహరి(నెల్లూరు), యు.శ్రావణి(గుంటూరు). అథ్లెటిక్స్‌లో కె.మన్మదరావు(కావలి). వీరితోపాటు స్వాతంత్రదినోత్సవం సందర్బంగా ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన పరేడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 బెటాలియన్ నుంచి గుంటూరు టీజేపీఎస్, జేకేసీ కళాశాలల కేడెట్లు, 2వ బెటాలియన్ నుంచి హిందూ కళాశాలకు చెందిన మైలా మణికుమార్, గుంటూరు జిల్లా నుంచి ఎంపికైన ఏకైక మహిళా కేడెట్ మారంరెడ్డి భవాని (జేఎంజే మహిళా కళాశాల, తెనాలి, 10వ బెటాలియన్), 23వ బెటాలియన్‌కు చెందిన సీనియర్ కేడెట్ వై.గ్రీష్మ, పి.సాల్మన్ రాజులకు ఉత్తమ కేడెట్ సర్టిఫికెట్లను అందజేశారు. కేడెట్లకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన అధికారులు
సీహెచ్ మాణిక్యరావు, కెప్టెన్ ఎన్.రమేష్‌బాబు అనులుకుమారి తోపాటు పలువురు పీఐ స్టాఫ్ ఉత్తమ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.