సాక్షి, గుంటూరు: వడ్లమూడిలోని విజ్ఞాన్ క్యాంపస్‌లో రెండ్రోజుల పాటు సాగే నేషనల్ యూత్ ఫెస్ట్ శుక్రవారం మొదలైంది. పలు ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్శిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. విజ్ఞాన్ మహోత్సవ్ పేరిట గత పద్నాలుగేళ్ళుగా దీన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 2010 నుంచి 2013 వరకు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 200 మంది విద్యార్ధులకు రూ. కోటి చెక్కుల్ని అకడమిక్ స్కాలర్‌షిప్పుల కింద పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన ఒరాకిల్ గ్లోబల్ కస్టమర్ సర్వీసెస్ డెరైక్టర్ సునీల్ కుంటేట మాట్లాడుతూ విద్యార్ధులు ఒక రంగంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విజ్ఞాన్ సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ క్లాసు రూం పాఠాలతో 20 శాతమే విజ్ఞానం లభిస్తుందని, దీనితో పాటు భావోద్వేగం, భౌతికం, మానసికం, సామాజికంగా జ్ఞానాన్ని పొందితేనే అది సంపూర్ణమవుతుందన్నారు. యువజనోత్సవాల ద్వారా టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. క్యాంపస్‌లో ‘స్ఫూర్తి’ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ మహోత్సవ్ కన్వీనర్ ఎ. రఘునాధ్, విజ్ఞాన్ వర్శిటీ ఛాన్సలర్ కె. రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విజ్ఞాన్ మహోత్సవ్-2014
Published Sat, Jan 11 2014 4:08 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
Advertisement