వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి  | We have to set new challenges for ourselves: PM Modi inaugurates National Youth Festival in Nashik | Sakshi
Sakshi News home page

వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి 

Published Sat, Jan 13 2024 1:24 AM | Last Updated on Sat, Jan 13 2024 1:59 AM

We have to set new challenges for ourselves: PM Modi inaugurates National Youth Festival in Nashik - Sakshi

నాసిక్‌: దేశంలో వారసత్వ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం వారంతా వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన దేశపు 21వ శతాబ్దపు యువత అత్యంత అదృష్టవంతులని పేర్కొన్నారు. అమృత కాలంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అద్భుత అవకాశం వారికి లభించింది’’ అన్నారు. మహారాష్ట్రలో నాసిక్‌లోని తపోవన్‌ మైదానంలో శుక్రవారం 27వ ‘నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌’ను మోదీ ప్రారంభించారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. మాదక ద్రవ్యాలకు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు.

యువతకు కర్తవ్య కాలం  
రాబోయే 25 ఏళ్ల అమృత కాలం యువతకు ‘కర్తవ్య కాలం’ అని మోదీ ఉద్ఘాటించారు. యువత ఓటు ద్వారా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు ఎంతగా పాల్గొంటే దేశ భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుందన్నారు. వారసత్వ రాజకీయాల ప్రభావమూ అంతగా తగ్గిపోతుందన్నారు. అరబిందో, వివేకానంద గొప్పతనాన్ని, వారు అందించిన సేవలను ప్రస్తావించారు.

నాసిక్‌ రామకుండ్‌లో పూజలు
మోదీ శుక్రవారం మహారాష్ట్రలో నాసిక్‌లోని శ్రీ కాలారామ్‌ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ్‌కుండ్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు నగరంలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. తర్వాత గోదావరి తీరంలోని రామ్‌కుండ్‌ వద్ద సంప్రదాయ తలపాగా ధరించి పూజలు చేశారు. జల పూజ, హారతిలో పాలుపంచుకున్నారు. అఖిల భారతీయ స్వామి సమర్థ్‌ గురుకుల పీఠం అధినేత అన్నాసాహెబ్‌ మోరే, కైలాస్‌ మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, తుషార్‌ బోసలేను కలుసుకున్నారు. తర్వాత పంచవటిలోని ప్రఖ్యాత కాలారామ్‌ మందిరంలో పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో మోదీ శ్రమదానం చేశారు. చీపురు చేతపట్టి పరిసరాలను చెత్తాచెదారం ఊడ్చేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ 1930 మార్చి 2న ఇదే మందిరంలో అంబేడ్కర్‌ తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం రూ.30,000 కోట్ల పై చిలుకు విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

ప్రధాని మోదీ 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం 
న్యూఢిల్లీ:  అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట శుక్రవారం నుంచి 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘నాకు చాలా ఉద్వేగంగా ఉంది. జీవితంలో తొలిసారిగా ఇలాంటి భావాలు నా మదిలో వెల్లువెత్తుతున్నాయి. వాటిని అనుభూతి చెందగలను తప్ప మాటల్లో వ్యక్తీకరించలేను. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ, రామ భక్తులకు పవిత్ర సందర్భం.

గొప్ప వేడుక. ఈ అరుదైన సందర్భానికి ప్రత్యక్ష సాక్షిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాలరాముడి ప్రాణప్రతిష్టకు భారతీయులందరి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి భగవంతుడు నన్ను సాధనంగా ఎంచుకున్నాడు. నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. అనుష్ఠానంలో భాగంగా మోదీ నిత్యం సూర్యోదయానికి ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాతి్వకాహారమే స్వీకరిస్తారు.   

‘అటల్‌ సేతు’ ప్రారంభం 
ముంబై:  21.8 కిలోమీటర్లతో అత్యంత పొడవైన సముద్ర వారధి ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి సెవ్రీ–నవా షివా అటల్‌ సేతు’ను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ‘వికసిత్‌ భారత్‌’కు ఈ సేతు ఒక ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఈ ఆరు లేన్ల బ్రిడ్జి మహారాష్ట్రలో దక్షిణ ముంబై–నవీ ముంబైని అనుసంధానిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement