ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు | Citizenship Amendment Act will not take away anyone citizenship | Sakshi
Sakshi News home page

ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు

Published Mon, Jan 13 2020 4:42 AM | Last Updated on Mon, Jan 13 2020 4:51 AM

Citizenship Amendment Act will not take away anyone citizenship - Sakshi

బేళూరు మఠంలో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీ

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా కొత్త చట్టాన్ని సమర్థించారు. సీఏఏ పట్ల పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్‌ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. స్వామి వివే కానంద జయంతి సందర్భంగా ఆదివారం ఆయన కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో ఏర్పాటు చేసిన యువజనదినోత్సవంలో మాట్లాడారు.

సీఏఏ పౌరసత్వాన్ని ఇస్తుంది, రద్దు చేయదు  
సీఏఏపై విపక్షాలు ఒక వర్గం యువతను పక్కదారి పట్టిస్తున్నాయని మోదీ విమర్శించారు. ఈ చట్టం వల్ల భారత్‌లో ఎవరి పౌరసత్వం రద్దు కాదని ప్రధాని పునరుద్ఘాటించారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు.  చట్టంతో నిమిత్తం లేకుండా దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉన్న వారు ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే, ఏ మతానికి చెందినవారైనా సరే భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సమస్యా ఉండదని ప్రధాని స్పష్టం చేశారు.   పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక తలదాచుకోవడానికి వచ్చిన శరణార్థుల్ని మీ చావు మీరు చావండని వెనక్కి పంపాలా? వారి పరిరక్షణ బాధ్యత మనది కాదా? అని ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రధాని చెప్పారు.  

కోల్‌కతా పోర్టు ట్రస్టుకి ముఖర్జీ పేరు
కోల్‌కతా పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ పేరుని జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ప్రకటించారు.   

మోదీ కార్యక్రమాలకు దీదీ దూరం  
మరోవైపు ప్రధాని ఆదివారం పాల్గొన్న అన్ని కార్యక్రమాలకు  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని.. మమత సర్కార్‌పై ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలేవీ మమతా సర్కార్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని రాకతో కోల్‌కతాలో సీఏఏ వ్యతిరేక నిరసనలు మరింత జోరుగా సాగాయి.

బేళూరు మఠంలో నిద్ర
కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ ప్రధాన కార్యాలయమైన బేళూరు మఠానికి రావడం, అక్కడ ఒక రాత్రి గడపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి తాను తన సొంత ఇంటికి వచ్చినట్టుందని అన్నారు. మఠంలో ఒక రాత్రి నిద్రించే అవకాశం ఇచ్చిన మతాధికారులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ‘‘బేళూరు మఠం ఒక యాత్రా స్థలం. కానీ నా వరకు ఇది సొంతిల్లులాంటిది. రామకృష్ణ మఠం అధ్యక్షుడు, ఇతరులు నాకు ఒక రాత్రి గడపడానికి అనుమతినివ్వడం నేను చేసుకున్న అదృష్టం. భద్రతా కారణాల రీత్యా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేను. అయినా ఆ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు’’అని మోదీ చెప్పారు.

తెల్లని కుర్తా, ధోవతి , మెడ చుట్టూ ఉత్తరీయం ధరించిన మోదీ రామకృష్ణ మిషన్‌తో తనకున్న అనుబంధాన్ని అక్కడ యువకులతో పంచుకున్నారు. ‘‘ఈ నేల, ఈ గాలి, ఈ నీరు 130 కోట్ల మంది ప్రజానీకానికి నేను సేవ చేయాలన్న నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. బేళూరు మఠానికి వస్తే స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సమక్షంలో ఉన్న అనుభూతి కలుగుతుంది’’అని అన్నారు. రామకృష్ణ మిషన్‌ మాజీ అధ్యక్షుడు, దివంగత ఆధ్యాత్మిక గురువు స్వామి అత్వస్థానందతో తనకి విడదీయలేని అనుబంధం ఉందని, ఆయన బోధనలు తన జీవన గమనాన్నే మార్చేశాయని అన్నారు.  రామకృష్ణ మిషన్‌ ప్రధానకార్యదర్శి స్వామి సువిరానంద ఈ మఠంలో రాత్రి నిద్ర చేసిన తొలి ప్రధాని మోదీయేనని అన్నారు. తమ కొడుకే ఇంటికి వచ్చినంత సంబరంగా ఉందన్నారు. మోదీ రాక మఠానికే గర్వకారణమని చెప్పారు.  

మఠంలోనే మెడిటేషన్‌
రెండు రోజుల పర్యటన కోసం కోల్‌కతాకు వచ్చిన ప్రధాని శనివారం రాత్రి బేళూరు మఠంలో ఇచ్చిన ప్రసాదాలు గోధుమ పాయసం, కూరగాయలతో కడుపు నింపుకున్నారు. ప్రతీరోజూ మార్నింగ్‌ వాక్‌ చేసే ప్రధాని ఆదివారం కావడంతో దానికి విరామం ఇచ్చారు. ఉదయం షుగర్‌ ఫ్రీ టీ తాగారు. బ్రేక్‌ ఫాస్ట్‌గా ఉప్మా, దోసె తీసుకున్నారు. మఠంలో సాధువులతో సంభాషించారు. కాసేపు «ధ్యానముద్రలో గడిపారు. ఆ తర్వాత జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద రచించిన పుస్తకాలను మతాధికారులు ప్రధానికి బహుమతిగా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement